దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలలై లైంగిక వేధింపులు.. అత్యాచారాలు.. హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ పెట్టిన సందర్భంలో కూడా పలు చోట్ల కామాంధులు రెచ్చిపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆడది కనిపిస్తే చాలు ఆటబొమ్మలా చూసే ఈ సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఓ మహిళా సంఘాలు.. నాయకులు గగ్గోలు పెడుతున్నా… దేశంలో ఎక్కడో అక్కడ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరీ దారుణమైన విషయం ఏంటంటే కామంతో కళ్లు మూసుకు పోయిన దుర్మార్గులు చిన్న పిల్లలు, వృద్దులు అని కూడా చూడకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగినిపై బెంగళూరులో అత్యాచారం జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు పోలీసులు కేసు నమోదుచేశారు. ఇద్దరు నైజీరియన్లను బనసవాడి పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బాధితురాలికి నిందితుల్లో ఒకరైన అంటోనితో చాలాకాలంగా పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. అతడితో సోషల్ మీడియాలో పరిచయం అయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న ఆమెతో కలిసి కమన్‌హళ్లిలోని తన స్నేహితుడి ఉబాకా ఇంటికి వెళ్లినట్లు సమాచారం. అక్కడే ముగ్గురూ కలిసి మద్యం సేవించినట్టు తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న యువతిపై ఇద్దరూ అత్యాచారం చేసినట్టు సమాచారం.
గత ఆదివారం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు తమకు ఫిర్యాదుచేసిందని బనసవాడీ పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా నిందితులు అబుజి ఉబాకా, టోనీలను అరెస్ట్ చేశామని తెలిపారు. నైజీరియా రాయబార కార్యాలయానికి అరెస్టు సమాచారాన్ని పంపారు. కాగా, తనపై అత్యాచారం జరిగిందని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. బాధితురాలి వివరాలు వెల్లడించని పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆమెను ఆసుపత్రికి పంపినట్టు తెలిపారు.