దేశంలో గత కొంత కాలంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పదులు సంఖ్యల్లో అమాయకులు చనిపోగా.. ఎంతో మంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు. డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
తునీ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున నలుగురు భవానీ భక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా వారిపై కారు దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పెసరం గ్రామం నుంచి నలుగురు భవానీ భక్తులు విజయవాడకు అమ్మారి దర్శనం కోసం వెళ్తున్నారు. అదే సమయంలో వైజాగ్ నుంచి అనపర్తి వెళ్తున్న కారు అతివేగంగా రావడంతో అదుపు తప్పి నడుచుకుంటూ వెళ్తున్న భవానీ భక్తులపై దూసుకు వెళ్లింది.
ఈ దుర్ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు ఈశ్వరరావు, సంతోష్ లుగా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భవానీ భక్తులు చనిపోయిన విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. పెసరం గ్రామం విశాదఛాయలు అలుముకున్నాయి.