నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో అక్రమ సంబంధాలు ప్రధానమైనవి. వీటి కారణంగా ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, ఓ మహిళ అక్రమ సంబంధం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ప్రియుడే ఆమె ప్రాణాలు తీశాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, తుముకూరు జిల్లా, తిరువేశ్వర తాలూకాలోని సంపిగ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి.. అదే ప్రాంతానికి చెందిన ఆశకు 12 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే, పెళ్లికి ముందు నుంచి ఆశకు తమ ఊరికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తితో సంబంధం ఉంది. పెళ్లయినా కూడా ఆ సంబంధం అలాగే కొనసాగింది. ఇద్దరూ తరచుగా కలిసేవారు. మొన్న రాత్రి పామాయిల్ గింజలు తీసుకురావటానికి ఆశ ప్రియుడి ఇంటికి వెళ్లింది. అక్కడ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఈ గొడవ తారాస్థాయికి చేరటంతో వెంకటేష్ ఆగ్రహానికి గురయ్యాడు. రాయితో ఆశ తలపై బలంగా కొట్టి చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఇంటి పక్కన ఉన్న గుంతలో పడేసి పోయాడు. ఆశ మృతదేహాన్ని గుంతలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమె ప్రియుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడు హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆశకు వెంకటేష్ తరచుగా డబ్బు సహాయం చేసే వాడని పోలీసులు తెలిపారు. ఆమె పెళ్లికి కూడా అతడు సహాయం చేసినట్లు వెల్లడించారు. హత్య జరిగిన రోజు వెంకటేషే పామాయిల్ గింజలు ఇస్తాను రమ్మని ఆశను ఇంటికి పిలిచినట్లు పేర్కొన్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆశ తనకు డబ్బులు కావాలని అడిగిందని, దీంతో గొడవ జరిగి హత్యకు దారి తీసిందని చెప్పారు.