తెలంగాణలో వెలుగు చూసిన పేపర్ లీకేజ్ కేసు రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ వ్యవహారం వెలుగు చూడటంతో.. పలు పరీక్షలు రద్దు కాగా.. గ్రూప్-1 ప్రిలిమ్స్ కూడా రద్దయ్యింది. ఇక తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో రోజులో భారీ ట్విస్ట్ రివీల్ అవుతోంది. తాజాగా ఈ కేసు దర్యాప్తులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. తవ్వేకొద్ది.. కలుగుల్లోంచి ఎలుకల్లాగా.. నిందితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఈ వ్యవాహారంపై ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉండటం, విపక్షాలు విమర్శలు చేస్తుండటంతో.. సిట్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను లోతుగా ప్రశ్నించి.. వారి వద్ద నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో గ్రూప్-1, ఏఈ పేపర్లు మాత్రమే కాక.. మొత్తం 15 పేపర్లు బయటకు వచ్చినట్లు తెలిసింది. ఆ వివరాలు..
పేపర్ లీకేజ్ కేసులో గ్రూప్-1, ఏఈ పేపర్లు మాత్రమే కాక.. మొత్తం ఆరు రకాల పోస్టులకు సంబంధించిన 15 క్వశ్చన్ పేపర్లు బయటకు వచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్ కుమార్, ఏ2గా ఉన్న టీఎస్‌పీఎస్సీ నెట్‌వర్క్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డితో పాటు అరెస్ట్ చేసిన మరో 13 మందిని.. పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తూ.. వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ లీక్ వ్యవహారం నడుస్తోన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ ప్రవీణ్‌తో పాటు సురేష్, రమేష్, రాజశేఖర్‌రెడ్డి, షమీమ్, ప్రశాంత్ రెడ్డికి మాత్రమే లీక్ అయినట్లు చెబుతున్నారు. వీరికి తప్ప ఇంకెవరికి గ్రూప్-1 పేపర్ లీక్ అయినట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సిట్ స్పష్టం చేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ పెన్‌డ్రైవ్‌లో ఆరు పోస్టుల ప్రశ్నాపత్రాలు కనిపించాయి అని సిట్ స్పష్టం చేసింది. వీటిల్లో గ్రూప్–1 ప్రిలిమ్స్‌తో పాటు అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ), టౌన్ ప్లానింగ్ బిజినెస్ ఓవర్సీర్ (టీపీబీఓ), జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిస్ట్రిక్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్షలకు సంబంధించిన పేపర్లు ఉన్నాయి. ఇవన్నీ మాస్టర్ క్వశ్చన్ పేపరు. అంటే.. వీటిల్లో ప్రశ్నలతో పాటు సమాధానాలు కూడా ఉన్నాయనని సిట్ అధికారులు తెలిపారు. ఆన్సర్స్ కూడా ఉండటంతో రెండు రోజుల్లో పరీక్షకు ప్రిపేర్ అయ్యారని, ఆన్సర్స్ లేకపోయి ఉంటే పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
మొత్తం 15 పేపర్లు అనగా.. టీపీబీఓ ఇంటర్మీడియట్ ఒకేషనల్ పేపర్–2, ఏఈఈ సివిల్ ఇంజినీరింగ్,టీపీబీఓ ఒకేషనల్ జనరల్ స్టడీస్ పేపర్–1, ఏఈఈ మెకానికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లమో ఏఈ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లమో ఏఈ, ఏఈఈ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, గ్రూప్–1 జనరల్ స్టడీస్, జనరల్ స్టడీస్ డిప్లమో ఏఈ, సివిల్ ఇంజినీరింగ్ డిప్లమో ఏఈ ,మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లమో ఏఈ పేపర్–2, డీఏఓ మాథమాటిక్స్, సివిల్ ఇంజినీరింగ్ డిప్లమో ఏఈ పేపర్–2, డీఏఓ జనరల్ స్టడీస్, జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్ పేపర్లు బయటకు వచ్చినట్లు విచారణలో తేలింది. ఇప్పటికే నిందితులందరినీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నిందితులు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.