ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి గౌహతి వెళ్తున్న రైలు సాంకేతికలోపంతో నిలిచిపోవడంతో చల్ల గాలికోసం కొంతమంది ప్రయాణికులు కిందకు దిగి పక్కనే ఉన్న ట్రాక్‌పై నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఆ ట్రాక్‌పై వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వీరిని ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. దీంతో వీరిని అదే రైలులో శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌కు తరలించారు.
ఈ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణం సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సమాచారం తెలిసిన వెంటనే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. మృతి చెందిన వారిలో ఇద్దరు అసోం రాష్ట్రానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.