ఇటీవల కొంతమంది ఈజీ మనీ ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. డబ్బు సంపాదించడానికి ఎంతటి నీచమైన పనికైనా సిద్దపడుతున్నారు. చైన్ స్నాచింగ్, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ దందా చేస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు.
ఈ మద్య దొంగలు కొత్త కొత్త పద్దతుల్లో చోరీలు చేస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. ఈజీ మనీ కోసం దేనికైనా సిద్దపడుతున్నారు కొంతమంది కేటుగాళ్ళు. చైన్ స్నాచింగ్, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ దందా చేస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. సాధారణంగా దొంగలు ప్రజల ఆస్తులను కొల్లగొట్టడం చూస్తుంటాం.. కానీ ఈ దొంగలు మాత్రం ప్రభుత్వ ఆస్తులనే టార్గెట్ చేసుకొని మరీ చోరీలు చేస్తున్నారు. ఏంటా ప్రభుత్వ ఆస్తులు అంటారా? ట్రాఫిక్ సిగ్నల్స్ కి సంబంధించిన బ్యాటరీలు. గత కొంతకాలంగా ట్రాఫిక్ సిగ్నల్స్ బ్యాటరీల చోరీకి పాల్పపడుతున్న వారిని ఆబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల ఆబిట్స్ సర్కిల్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ హఠాత్తుగా ఆగిపోయాయి. దాంతో ప్రధాన కూడలి వద్ద వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. అకస్మాత్తుగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఆగిపోవడం ఏంటా అని పోలీసులు పరిశీలించగా బ్యాటరీలు కనిపించలేదు. ఒక్కసారే షాక్ కి గురైన ట్రాఫిక్ పోలీసులు వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఆబిట్స్ సర్కిల్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడం గుర్తించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ బ్యాటరీలను చోరీ చేస్తున్నది జంగాల మదిలేటి, షేక్ అజాముద్దీన్ గా గుర్తించారు. కొంత కాలంగా వీరిద్దరూ కలిసి బ్యాటరీలను చోరీ చేసి ఆటోలో తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే వారిపై కేసు నమోదు చేశారు.
ఈ ఇద్దరు దొంగలు ఇప్పటి వరకు 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో 74 ట్రాఫిక్ సిగ్నల్స్ బ్యాటరీలు దొంగిలించినట్లు తెలిసింది. జల్సాలకు అలవాటు పడ్డ ఈ ఇద్దరు దొంగలు రాత్రి పూటకానీ, తెల్లవారుజామున మనుషుల సంచారం లేని సమయంలో సిగ్నల్స్ వద్దకు మెల్లిగా బ్యాటరీలు దొంగిలించి అమ్ముకునేవాని పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ.5 లక్షల విలువైన పెద్ద బ్యాటరీలు, చిన్న బ్యాటరీలు రికవరీ చేశారు. నిందితులు జంగల మద్దిలేటి, షేక్ అజిముద్దీన్ లపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు సిరియస్ గా తీసుకొని నిందితులను పట్టుకున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.