ట్రాఫిక్ చలానా ఏం చేస్తుందిలే అనుకుంటే బిల్లు కట్టమని ఫోన్ కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వస్తే ఓకే కానీ మరీ కుటుంబంలో చిచ్చు పెడితేనే ఆశ్చర్యం వేస్తుంది. ఓ ట్రాఫిక్ చలానా కారణంగా భార్యాభర్తల మధ్య చిచ్చు రగిలింది. ఏకంగా అతన్ని జైలుకెళ్లేలా చేసింది.
రోడ్డు మీద వాహనంపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫోన్ కి చలానా పడ్డట్టు మెసేజ్ వచ్చేస్తుంది. అయితే అదే మెసేజ్ ఒక వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేస్తుందని.. ఒక కుటుంబాన్ని నాశనం చేస్తుందని.. ఒక వ్యక్తిని జైలు పాలు చేస్తుందని ఎవరైనా అనుకుంటారా? కానీ ఇక్కడ అదే జరిగింది. ట్రాఫిక్ చలానా ఓ వ్యక్తి కొంప ముంచింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడేమో అన్న అనుమానంతో భార్య అతనిపై కేసు పెట్టింది. చివరకు జైలుకు వెళ్లేలా చేసింది. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. ఏప్రిల్ 25న ఒక వ్యక్తి తన స్కూటీపై ఓ మహిళను ఎక్కించుకుని వెళ్తున్నాడు. అయితే నెత్తిన హెల్మెట్ ధరించలేదు. దీంతో రోడ్డు మీద ఉన్న ఏఐ కెమెరాలు ఫోటోలను తీశాయి. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కారణంగా చలానా అతని భార్య ఫోన్ కి వెళ్ళింది.
ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డాడని మెసేజుతో పాటు ఫోటోని కూడా ఆ వ్యక్తి భార్య ఫోన్ కి పంపించారు ట్రాఫిక్ పోలీసులు. ఎందుకంటే స్కూటీ ఆమె పేరు మీదే రిజిస్టర్ అయి ఉంది. భర్త వేరే మహిళతో ఉన్న ఫోటోను చూసి ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే భర్తను ఎవరా ఊహ అంటూ నిలదీసింది. కానీ భర్త మాత్రం ఆమె ఎవరో తనకు తెలియదని.. లిఫ్ట్ అడిగితే ఇచ్చానని చెప్పాడు. కానీ భార్య నమ్మలేదు. అతనితో వాగ్వాదానికి దిగింది. తన భర్త ఫోటోలో ఉన్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో రోజూ గొడవపడేది. కట్ చేస్తే మే 5న భర్తపై కరమన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా హింసించడంతో పాటు తన మూడేళ్ల కూతురిని కూడా వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
దీనికి సంబంధించి ఆధారాలు లేకపోయినా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. 321, 341, 294, 75 సెక్షన్ల కింద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే ఆ వ్యక్తి స్కూటీ ఎక్కిన మహిళ ఎవరు అన్న విషయాన్ని పోలీసులు గుర్తించలేకపోయారు. ఆమెతో వివాహేతర సంబంధం ఉందా? లేక అతను చెప్తున్నట్లు లిఫ్ట్ మాత్రమే ఇచ్చాడా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘అరేయ్ సూరిబాబు ఏంట్రా ఇది.. ఒక హెల్మెట్ కొనుక్కుని ఉంటే ఈ బాధలు ఉండకపోదును కదరా.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ కామెంట్ కూడా పోస్ట్ చేయండి.