ఈ మధ్యకాలంలో టీనేజ్ పిల్లలు ఆవేశాలకు లోనవుతున్నారు. వయస్సు ప్రభావంతో తమకు తామే హీరోలుగా భావించుకుని, ఇంట్లో వారికి సైతం ఎదురు తిరుగుతున్నారు. కొందరు టీనేజ్ పిల్లలు బయట వారితో ప్రవర్తించే తీరు గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైన హంగామా, అల్లరి చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించినప్పుడు అడ్డుకునే వారిపై దాడులకు సైతం పాల్పడుతున్నారు. మరికొందరు హత్య చేయడానికి కూడా వెనకాడని ఘటనలు కూడా జరిగాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. టపాసులను సీసాలో పెట్టి కాల్చొద్దని చెప్పినందుకు ముగ్గురు మైనర్ల చేతిలో 21 ఏళ్ల యువకు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని ముంబై నగరంలో శివాజి నగర్ ప్రాంతంలో ముగ్గురు మైనర్లు బహిరంగంగా పెద్ద పెద్ద టాపాసులు కాలుస్తున్నారు. కొద్ది సేపటికి మరికొన్ని టపాసులను సీసాల్లో పెట్టి కాలుస్తున్నారు. ఈ ముగ్గురు బాలుర ప్రవర్తనకు చుట్టుపక్కల వారు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న 21 ఏళ్ల యువకుడు అలా టాపాసులు కాల్చొద్దని వారితో వారించాడు. ఈక్రమంలో ఇరువురి మధ్య మాట మాట పెరిగి పెద్ద వాగ్వాదం తలెత్తింది. ముగ్గురు మైనర్లలోని ఒకరు కోపంతో సదరు వ్యక్తిని దారుణంగా కొట్టాడు. అనంతరం చాకుతో మెడపై పొడిచి పరారయ్యాడు. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితులైన మైనర్లులో ఇద్దరు 14, 15 ఏళ్లు ఉండగా మరొకరికి 12 ఏళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన శివాజి నగర్ లోని గోవండి ప్రాంతంలో మధ్యాహ్న సమయంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉల్కిపడ్డారు. పిల్లల్లో ఇంతలా క్రూరత్వం ఏందుకు వచ్చిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.