దేశంలో అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పసి మొగ్గలు మొదలు.. పండుటాకుల వరకు ఎవరిని వదలడం లేదు మృగాళ్లు. కామంతో కళ్లు ముసుకుపోయిన రాక్షసులు.. కన్నతల్లిని.. కడుపున పుట్టిన బిడ్డలను కూడా వదలడం లేదు. వారిపై కూడా అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే దారుణం ఒకటి వెలుగు చూసింది. నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లి పట్ల ఓ కామాంధ కొడుకు కొద్దిరోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆగ్రహంతో ఉన్న తండ్రి.. ఆ కొడుకును నరికి చంపాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల శివారు గాజాతండాలో చోటుచేసుకుంది.
సీరోలు ఎస్‌ఐ లావుడ్య నరేష్ తెలిపిన కథనం ప్రకారం.. నల్లెల్ల శివారు గాజాతండాకు చెందిన దంపతులు ధారావత్ భాషా, అచ్చాలకు రమేష్ (36) అనే కుమారుడు ఉన్నాడు. అతడికి వివాహం అయి, పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో రమేష్.. భార్యాపిల్లలతో కలిసి నెల్లికుదురు మండలం వావిలాల గ్రామంలో ఉండేవాడు. ఆరు నెలల క్రితం భార్య అతన్ని విడిచి వెళ్లిపోయింది. దీంతో అతను గాజాతండాకు వచ్చి తల్లిదండ్రులు దంపతులు భాషా, అచ్చాలు వద్ద ఉంటున్నాడు. భార్య పోయిందని మద్యానికి బానిసైన రమేశ్ తాగి వచ్చి.. ప్రతి రోజూ ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడు.
ఇది కూడా చదవండి : ఊరిలో భర్త లేని మహిళ! ఊరంతా కలిసి ఇంత దారుణమా?
అంతటితో ఆగక తల్లి అచ్చాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. లైంగికంగా వేధింపులకు గురిచేస్తుండేవాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం తండ్రి భాషాకు పింఛన్ డబ్బులు వచ్చాయి. అవి తనకు ఇవ్వాల్సిందిగా రమేష్ తండ్రితో గొడవపడ్డాడు. కుమారుడు నిత్యం ఇలా తమని డబ్బుల కోసం వెధించడమే కాక.. కన్నతల్లి అని కూడా చూడకుండా ఆమెను లైంగికంగా వేధిస్తుండడంతో ఆగ్రహంతో ఉన్న తండ్రి భాషా ఇంట్లో ఉన్న గొడ్డలితో కొడుకు రమేష్ గొంతు, మెడపై నరికాడు. ఈ క్రమంలో రమేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. కొడుకును నరికి చంపిన విషయం తండాలో తెలియడంతో వెంటనే సీరోలు పోలీసులకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి : కడుపులో బిడ్డను అబ్బాయిగా మారుస్తానంటూ.. నకిలీ బాబా అమానుషం..
విషయం తెలుసుకున్న ఎస్సై లావుడ్య నరేష్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విషయాన్ని మరిపెడ సీఐ సాగర్‌కు వివరించడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. హత్య చేసిన తండ్రి భాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.