ప్రేమించి పెళ్లాడటం, ప్రేమలో చెట్టాపట్టాలేసుకు తిరగడం సర్వ సాధారణం అయ్యింది. అదే సమయంలో ప్రేమ పేరుతో కోరికలు తీర్చుకోవడం.. పెళ్లి అనేసరికి ముఖం చాటేయడం కూడా అంతే కామన్ అయిపోయింది. అలాంటి అన్యాయాలు ఎంత మందికి జరిగినా కూడా ఇంకా కొత్త బాధితులు వస్తూనే ఉన్నారు. అంటే మన దాకా వస్తే కానీ తెలియదు అంటారు కదా. అలా స్వీయ అనుభవం అయితే గానీ జాగ్రత్త పడరేమో? అలా ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడో డీఎంకే గ్రామ కార్యదర్శి. ప్రేమించానని ముగ్గులోకి దించి.. తీరా గర్భం దాల్చగానే ఎవరు నువ్వు నాకు తెలీదు అంటూ ముఖం చాటేశాడు. ఆ దెబ్బకు షాక్ తిన్న యువతి పోలీసులను ఆశ్రయించింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరువళ్లూరు గ్రామ కార్యదర్శి మురుగన్- నివేద అనే యువతి మధ్య ఆరేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో హద్దులు దాటేసింది. ఆరేళ్ల నుంచి ప్రేమలో ఈ లోకాన్నే మర్చిపోయారు. చివరికి ఆమె 3 నెలల గర్భవతి అని తెలియగానే మురుగన్ అసలు రంగు బయట పడింది. ఆమెతో వివాహానికి నిరాకరించాడు. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. ఎందుకు నిరాకరిస్తున్నాడనే విషయం చెప్పలేదు. కానీ, నివేదతో పెళ్లికి మాత్రం మురుగన్ ససేమిరా అన్నాడు.
మోస పోయానని గ్రహించిన యువతి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. బుధవారం ఎస్పీ వరుణ్ కుమార్ ను కలిసి మురుగన్ పై ఫిర్యాదు చేసింది. యువతికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ మహిళా పోలీసులను ఆదేశించారు. ‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఉపయోగం ఉండదు’ అనే సామెత వినే ఉంటారు. ఎప్పుడైనా మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకొని అడుగు వేయాలి. ఒకసారి అడుగు పడిన తర్వాత కొన్నిసార్లు వెనక్కి తీసుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఆ యువతి తాను మోసపోయాననే విషయం తెలుసుకోవడానికి ఆరేళ్లు పట్టింది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో తప్పుఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.