ఈ మద్య కాలంలో మనిషికి మృత్యువు ఏ క్షణంలో కబలిస్తుందో తెలియని పరిస్తితి. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు ఉన్నచోటే కుప్పకూలి పోతున్నారు. కళ్లముందే మృత్యువడిలోకి చేరుకుంటున్నారు.
మనిషికి మృత్యువు ఏ రూపంలో వచ్చి కబలిస్తుందో ఎవరూ ఊహించలేరు.. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వాల్లు హఠాత్తుగా కన్నుమూస్తున్నారు. ఇటీవల గుండెపోటు మరణాలు, రోడ్డు ప్రమాదాలు, అనుకోకుండా జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అందరూ సంతోషంగా పెళ్లి బారాత్ లో ఉండగా ఒక చిన్న పొరపాటు వల్ల చిన్నారి మృత్యు వడిలోకి చేరుకుంది. ఈ ఘటన సూర్యపేట లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సూర్యపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం తండాలో విషాదం చోటు చేసుకుంది. తండాలో ఓ జంట పెళ్లి వేడుకలు జరిగాయి.. పెళ్లి తర్వాత ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా బారాత్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ బరాత్ జరిగే సమయానికే ఇంద్రజ అనే అమ్మాయి పెళ్లి కుమార్తెకు తోడుగా కారులో కూర్చుంది. ఇంద్రజ కారు లో కూర్చొని కిటికీ అద్దాలు తీసి బరత్ లో డాన్సులు చేస్తున్నా వాళ్లను చూసుకుంటూ కూర్చుంది. అలా చూస్తుండగా అమ్మాయి కిటికీలో నుంచి తల బయటకు పెట్టి చూస్తున్న విషయం గమనించకుండా.. డ్రైవర్ ఒక్కసారిగా గ్లాస్ డోర్ ఎక్కించేందుకు బటన్ నొక్కాడు. దీంతో గ్లాస్ కు డోర్ కు మధ్య అమ్మాయి ఇంద్రజ మెడ అందులో ఇరుక్కుపోయింది.
బారాతో సందర్భంగా డీజే సౌండ్స్ కి ఆ చిన్నారి కేకలు వేసినా ఎవరు పట్టించుకోలేదు. దీంతో గ్లాస్ బిగుసుకుపోయి చిన్నారి ఊపిరి ఆడకపోవడంతో మృతి చెందింది. కొద్ది సేపటి తర్వాత ఆ అమ్మాయి గ్లాస్ మధ్యబాగంలో ఉండిపోవడం చూసి ఒకేసారి షాక్ కు గురయ్యారు. వెంటనే డోర్ అద్దాలు దింపారు.. అప్పటికే ఇంద్రజ మృతి చెందింది. చిన్నారి ఇంద్రజ మృతి చెందడంతో అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న తండా వాసులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఇంద్రజ మృతి చెందిందని బంధువులు, కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. సమాచారం అందుకున్నా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం చేయడానికి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.