మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. కొందరు తెలిసి తెలియక చేస్తారు.. మరికొందరు కావలసి చేస్తారు. ఏ విధంగా చేసినా తన తప్పు తెలుకున్నారంటేనే వారు మారినట్లు. తాజాగా ఓ ఇద్దరు దొంగతనం చేస్తూ దొరికిపోయారు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. తాము చేసింది తప్పు అని భావించారు. కానీ పెద్దల సమక్షంలో పంచాయితీ వారికి అవమానంగా అనిపించింది. చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతకీ వారు దొంగతనం చేసింది ఏమిటో తెలుసా? కేవలం ఒకే ఒక్క సైకిల్!
వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం గంజిగూడెంకు చెందిన వెంకట్(45), లక్ష్మయ్య(55)లు సోమవారం రాత్రి సంగారెడ్డి కోర్టు ఆవరణంలో ఓ సైకిల్ దొంగతనం చేశారు. దానిని వారి గ్రామంలో దాచిపెట్టి..అదే గ్రామానికి చెందిన కృష్ణయ్య బైక్ ను దొంగతనం చేశారు. ఆ బైక్ ను తీసుకెళ్లి ఊరి బయట కాలువలో పడేశారు. మరొసారి అదే గ్రామంలో మల్లేశంకు చెందిన పశువులను దొంగతనం చేస్తుండాగా అతను గమనించి కేకలు వేశాడు. ఆ కేకలకు మేల్కొన్న స్థానికులు వారిని పట్టుకున్నారు.
మరుసటి రోజు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలో వెంకట్, లక్ష్మయ్య కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్థులు వారిని దూషించారు. దానిని వెంకట్, లక్ష్మయ్యలు అవమానంగా ఫీలయ్యారు. గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పోలీసులకు విచారణకు రాలేదు. దీంతో ఊరంతా కలసి తమని ఏమి చేస్తారో అని ఆ దొంగలు భయాందోళన చెందారు.
ఈ క్రమంలో వీరిద్దరూ ఊరి బయటకు వెళ్లి కల్లు తాగారు. అనంతరం సంగారెడ్డి వెళ్లి మద్యం కొనుగోలు చేసి అందులో గడ్డి మందు కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం సైకిల్ దొంగతనానికే పంచాయితీ పెట్టి, వీరిని తీవ్రంగా దూషించి, బెదిరించి.. వీరి చావుకు గ్రామ పెద్దలు కారణయ్యారని బంధువు ఆరోపిస్తున్నారు. మరి.. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.