పెళ్లి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో మంది కుర్రాళ్ల కల అది. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. భార్యతో కలిసి చెట్టపట్టాలేసుకు తిరిగేయాలి. ఆనందమైన జీవితం గడపాలి అనుకుంటారు. అలాంటి కోరికలతో ఓ వరుడు వివాహం చేసుకున్నాడు. రెండ్రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత ఆమె అసలు రూపం బయట పడింది. వంటచేసి అన్నంలో విషం కలిపి అత్తవారింట్లో అందరికీ పెట్టింది. ఇంట్లో ఉన్న బంగారం, నగలు, డబ్బు చెక్కేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ జిల్లా కోట్ పుట్లీ ప్రాంతానికి చెందిన నందూ పట్నా అనే యువకుడు పూజారాణి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. బంధుమిత్రుల సమక్షంలో వారి వివాహం ఎంతో ఘనంగా, అట్టహాసంగా జరిగింది. నవ వధువు మొదటి రెండు రోజులు మామూలుగానే ఉంది. ఆ తర్వాత కొత్త పెళ్లికూతురు అయినా కూడా వంటింట్లోకి వచ్చేసింది. అత్తగారు ఎందుకులేమ్మా అంటూ వారించింది. కానీ, ఆమె వినలేదు. ఈ రోజు అందరికీ నేనే వంట చేస్తా అంటూ గరిటె పట్టింది. నాకు ఎంత మంచి కోడలు వచ్చింది అని ఆ అత్త తెగ మురిసిపోయింది.
వంటచేసింది.. అత్త, మామ, భర్తకు వడ్డించింది. ఆమె మాత్రం తినలేదు. వారు తమతో పాటు తినమని ఎంత కోరినా తినలేదు. ఆ తర్వాత తెలిసింది. ఆమె ఎందుకు తినలేదు అని. ఆ అన్నంలో ఆమె మత్తు మందో లేక విషమో కలిపింది. అది తిన్న వారంతా స్పృహ కోల్పోయారు. తెల్లారినా కూడా ఎవరూ బయటకు రాకపోవడంతో పొరుగు వారు తలుపులు పగలగొట్టి చూడగా అందరూ స్పృహ తప్పి ఉన్నారు.
వారిని ఆస్పత్రిలో చేర్పించారు. వారు కోలుకున్నాక.. ఇంకో పిడుగులాంటి వార్త తెలిసింది. ఇంట్లో ఉన్న డబ్బు, నగలు, ఆభరణాలు అన్నీ తీసుకుని కొత్త పెళ్లి కూతురు చెక్కేసింది. ఆ సంబంధాన్ని ఓ పెళ్లిళ్ల పేరయ్య తెచ్చాడు. అతడికి లక్ష కమీషన్ కూడా ఇచ్చుకున్నారంట. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.