ఈ మద్య కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవపడటంతో విడిపోతున్నారు. భాగస్వామితో విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా చంపుకుంటున్నారు.
వేద మంత్రాల సాక్షిగా, బంధుమిత్రుల ఆశీర్వాదంతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతారు కొత్తజంట. పెళ్లి తర్వాత సంతోషమైన జీవితాన్ని గడపాలని ఇరు కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తారు. కానీ ఈ మద్య పెళ్లైన ఏడాది దాటకముందే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు తలెత్తి మనస్పర్ధలు తలెత్తుతున్నాయి. దీంతో భాగస్వామితో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. మరోవైపు అక్రమ సంబంధాల నేపథ్యంలో కూడా ఒకరినొకరు చంపుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తనకు భోజనం పెట్టలేదన్న చిన్న కారణంతో భర్త కసాయిగా మారి భార్యను చంపిన ఘటన రాజస్థాన్ జోద్‌పూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ లోని జోధ్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య భోజనం వడ్డించలేదన్న కోపంతో భర్త బండరాయితో కొట్టి మరీ చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేష్ బెనివాల్ (35) కి సుమన్ బెనివాల్ తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ వస్తున్నాయి. వృత్తిరిత్యా వ్యాపారి అయిన రమేష్ తరుచూ జోధ్‌పూర్ కి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే శనివారం అర్థరాత్రి రమేష్ జోధ్‌పూర్ కి వెళ్లి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. భార్యను భోజనం వడ్డించమని అడిగాడు. అర్ధరాత్రి వచ్చి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని సుమన్ బెనివాల్ అగడంతో రమేష్ కోపంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న బండరాయితో తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
క్షణికావేశంలో తాను చేసిన తప్పు తెలుసుకున్న రమేష్ భయంతో తన బావ మరిదికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పాడు. అతని బావమరిది పోలీసులకు సమాచారం అందించంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రమేష్ బెనివాల్ ని అరెస్ట్ చేశారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. చిన్న విషయానికే ఆవేశానికి గురై కట్టుకున్న భార్యను కడతేర్చడంతో ఇద్దరు పిల్లలు తల్లికోసం తల్లడిల్లిపోయారు. సుమన్ బెనివాల్ చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లి చనిపోయింది.. తండ్రి జైలుకు వెళ్లడంతో అమాయకంగా బిక్కమొఖంతో ఉన్న పిల్లలను చూసి స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.