‘కట్నం తీసుకునే వాడు గాడిద’ అని వినే ఉంటారు. ప్రస్తుతం వరకట్నం అరాచకాలు కాస్త తగ్గు ముఖం పట్టినప్పటికీ.. అసలు లేవు అని చెప్పలేం. ఎందుకంటే అలాంటి ఘటనలు ఇంకా అక్కడో ఇక్కడో ఎక్కడో ఒకచోట ఇంకా జరుగుతున్నాయి కాబట్టి. కట్నం ఇచ్చినా అది చాలదు ఇంకా తేవాలంటూ వేధింపులకు గురి చేయడంతో ఏడాదిన్నర చిన్నారితో సహా ఆరునెలల గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడింది. వారు చూపిస్తున్న నరకం కంటే ప్రాణాలు తీసుకోవడమే కరెక్ట్ అనుకుందో ఏమో అంతటి ఘోరానికి పాల్పడింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. ఎస్‌ఐ రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం మండలం బంజేరుపల్లికి చెందిన చిగుర్ల రమేశ్ పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్నాడు. అతనికి జూలపల్లికి చెందిన మౌనికతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారికి ఏడాదిన్నర పాప(జున్ను) కూడా ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం నుంచి అత్తింటిలో మౌనికకు అనుకోని కష్టాలు, సూటిపోటి మాటలతో వేధింపులు మొదలయ్యాయి. ఎందుకిలా జరుగుతోందో తెలుసుకునేందుకు మౌనికకు కాస్త సమయం పట్టింది. అసలు విషయం తెలుసుకుని ఆవేదనకు గురైంది.
అదనపు కట్నం కోసమే తన భర్త, అత్త వేధింపులకు గురి చేస్తున్న విషయం మౌనికకు అర్థమైంది. వివాహ సమయంలో మౌనిక తల్లిదండ్రులు రూ.30 లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. అది చాలదన్నట్లు ఇంకా అదనపు కట్నం కావాలంటూ మౌనికను వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టారు. అలాగే మంగళవారం రాత్రి భర్త రమేశ్, అత్త లక్ష్మి.. మౌనికతో గొడవకు దిగారు. పుట్టింట్లో ఈ విషయాలు చెప్పుకోలేక మౌనిక తనలో తానే కుమిలి పోయింది. ఈ జీవితం ఎందుకు బతకడం అని అనుకుందో? తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి బాధ పెట్టలేను అనుకుందో? బుధవారం ఉదయం బిడ్డను తీసుకుని మౌనిక ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ఇదీ చదవండి: కడుపు చేసి.. పెళ్ళికి నిరాకరించి! అధికార పార్టీ లీడర్ దారుణం!
భార్య కనిపించకపోవడంతో భర్త రమేశ్ తన బావమరిది(మౌనిక సోదరుడు)కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే బండారి రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ దృశ్యాలు పరిశీలించిన పోలీసులు.. మౌనిక బిడ్డను తీసుకుని ఎల్లమ్మ చెరువు కట్ట సమీపంలోని రోడ్డులో వెళ్లినట్లు గుర్తించారు. ఆ రోడ్డులో పరిశీలించగా ఓ వ్యవసాయ బావిలో మౌనిక, బిడ్డ మృతదేహాలను గుర్తించారు. మౌనిక సోదరుడు బండారి రమేశ్ ఫిర్యాదు మేరకు చిగుర్ల రమేశ్ అతని తల్లి లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బుపై వారికున్న అత్యాశ ఓ తల్లి, ఓచిన్నారి, ఇంకా ఈ లోకంలోకి అడుగు కూడా పెట్టని ఓ ఆరునెలల పిండాన్ని బలి తీసుకుంది. ఇప్పుడు అదనపు కట్నం ఇచ్చినా కూడా.. పోయిన మౌనిక, జున్ను ప్రాణాలు తిరిగి రావు కదా? ఒకవేళ ఇప్పుడు ఇస్తే వారికి డబ్బుపై ఉన్న అత్యాశ చావదు కదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.