ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో జరిగే మోసాలు బాగా పెరిగిపోయాయి. ప్రేమ అనే ఓ ముసుగు వేసుకుని కొందరు యువకులు యువతులను వలలో వేసుకుంటున్నారు. తమ అవసరం తీరిన తరువాత వదిలించుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. పెళ్లైన వారు కూడా.. తమ పెళ్లి విషయాన్ని దాచి పెట్టి.. అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. ఈక్రమంలో ప్రేమ పేరుతో తమకు జరిగిన మోసాన్ని తట్టుకోలేక కొందరు యువతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. గతంలోనే పెళ్లైన ఓ డాక్టర్.. సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఆ తరువాత అతడి మోసం తెలిసి ఆ యువతి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
సివిల్స్ ప్రిపేర్ అవుతున్న పూజిత అనే యువతికి నిమ్స్ లో డాక్టర్ గా పనిచేస్తున్న మహుమద్ అలీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం తల్లికి వైద్యం చేయించేందుకు పూజిత నిమ్స్ కి వెళ్లింది. ఆ సమయంలోనే పూజితకు అలీతో పరిచయం ఏర్పడింది. తనకు పెళ్లైన విషయాన్ని దాచి పెట్టిన అలీ.. పూజితను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ప్రేమిస్తున్నాను, పెళ్లిచేసుకుంటున్నాని మాయమాటల చెప్పి.. పూజితను నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన పూజిత.. తాను కూడా ప్రేమించడం మొదలు పెట్టింది. అయితే కొంతకాలానికి అలీపై పూజితకుఅనుమానం వచ్చింది. దీంతో అతడిని నిలదీసి అడగ్గా.. తనకు గతంలోనే పెళ్లైనట్లు ఒప్పుకున్నాడు. అయితే తన భార్యకు విడాకులు ఇచ్చి..పూజితను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
అతడి మాటలు నమ్మిన పూజిత పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. తనను పెళ్లి చేసుకోమని అలీని అడగ్గా.. అతడు మాట దాటవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తాను మోసపోయినట్లు పూజిత గ్రహించి మనస్తాపం చెంది.. ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ పేరుతో నిమ్స్ లో పనిచేస్తున్న డాక్టర్ మహుమద్ అలీ మోసం చేయడం వలనే పూజిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో మహుమద్ అలీని ఎస్ వోఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.