దేశంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక్కరు చేసిన తప్పుకి ఎంతోమంది అమాయకులు బలిఅవుతున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం.. అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ అధికారులు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని వాహనదారులకు ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్సు.. బైక్ ని ఢీ కొట్టిన ఘటనలో తల్లీకూతుళ్లు చనిపోయారు. ఈ విషాద ఘటన బనగానపల్లెలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కర్నూల్ జిల్లా ప్యాపిలి మండలం అలేబాద్ గ్రామినికి చెందిన ఎస్. మనోహర్, లక్ష్మ దంపతులు. వీరికి ఒక కుమార్తె.. పేరు మానస. లక్ష్మి తల్లిదండ్రులు బనగానపల్లెలో ఉన్నారు. తన తల్లిదండ్రులను చూడటానికి లక్ష్మి, మనోహర్ తమ కూతురు మానసతో కలిసి బనగానపల్లెకు బైక్ పై బయలుదేరారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సు మృత్యురూపంలో వారిని వెంటాడింది. మార్గమద్యలో దద్దణాల సమీపం వద్ద బనగానపల్లె నుంచి గుత్తికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ని ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై నుంచి కిందపడిన లక్ష్మీ, మానసపై నుంచి బస్సు టైర్లు వెళ్లడంతో స్పాట్ లోనే తల్లీకూతుళ్లు స్పాట్ లోనే చనిపోయారు. మనోహర్ పక్కన పడటంతో స్వల్ప గాయాలు అయ్యాయి.
ప్రమాదం గురించి తెలిసిన ఎస్ఐ రామిరెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్ ని తమకు అప్పగించాలని రోడ్డుపై మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఎస్ఐ రామిరెడ్డి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. లక్ష్మి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు. ఒకేసారి తల్లీకూతుళ్లు కానరాని లోకానికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. స్థానికులు విషాదంలో మునిగిపోయారు.