ఆన్ లైన్ గేమ్స్ వల్ల జరుగుతున్న అనర్థాలు కొనసాగుతూనే ఉన్నాయి. పిల్లలు ఆన్ లైన్ ఆటలకు బానిసలుగా మారిపోయి.. తల్లిదండ్రులను ఇబ్బందుల్లోకి నెట్టటం, ప్రాణాలు తీసుకోవడం, తీయడం చేస్తున్నారు. ఇటీవల పబ్ జీ ఆడుకోనివ్వలేదని తల్లిని గన్ తో కాల్చి చంపడం చూశాం. ఓ కుర్రాడు ఆన్ లైన్ గేమ్ ఆడుతుడూ రూ.36 లక్షలు పోగొట్టడం చూశాం. తాజాగా ఓ యువకుడు పబ్ జీ గేమ్ లో ఓడిపోయినందుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కని పెంచిన తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చాడు.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పబ్ జీ గేమ్ కు మరో ప్రాణం బలైంది. 9వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల ప్రభు వేసవి సెలవులకు మచిలీపట్నం వచ్చాడు. రోజూ ప్రభు స్నేహితులతో కలిసి పబ్ జీ ఆడుతున్నాడు. శనివారం సాయంత్రం స్నేహితులతో కలిసి పబ్ జీ ఆడగా.. ప్రభు ఆటలో ఓడిపోయాడు. గేమ్ గెలవకపోవడంపై అతని మిత్రులు ప్రభును ఎగతాళి చేశారని తెలుస్తోంది.
ఆటలో ఓడిపోయాక ప్రభు వెనకాల గదిలో పడుకుంటానని వెళ్లిపోయాడు. ఆ తర్వాత తెల్లారి ఎంతకీ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో తలుపులు తెరిచి చూడగా.. ప్రభు ఫ్యానుకు ఉరివేసుకుని ఉండటం చూశారు. వెంటనే హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందనట్లు నిర్ధారించారు. స్నేహితులు గేళి చేయడం వల్లే అతను ఉరివేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.