‘ధనం మూలం ఇదం జగత్’ అంటే ఈ ప్రపంచం డబ్బుతోనే నడుస్తోంది అని అర్థం. కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమేనేమో అనే సందేహం రాక మానదు. ఎందుకంటే కొందరు పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా వారు పంచే ఆస్తులంటేనే ఎక్కువ అభిమానం. అందుకోసం కన్నవారిని కడతేర్చడానికి కూడా ఆలోచించడం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయే పుత్రులు ఆ కోవకు చెందినవారే. స్థలం అమ్మి వచ్చిన డబ్బును సమానంగా పంచుతాననగా.. కాదు మొత్తం మాకే కావాలంటూ అతి కిరాతకంగా కత్తితో తండ్రిని పొడిచి చంపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం మండ్యా జిల్లా శ్రీరంగపట్టణం తాలూకా కరెమేగళకొప్పలు గ్రామంలో మరికాళయ్య(60) నివాసముండేవారు. ఆయనకు శశికుమార్, రాజేశ్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. మరికాళయ్య తన పేరు మీద ఉన్న భూమిని రూ.30 లక్షలకు బేరం పెట్టారు. ఆ స్థలం అమ్మగా వచ్చిన డబ్బును ముగ్గురూ తలా రూ.10 లక్షల చొప్పున తీసుకుందామని అనుకున్నారు. కానీ, ఆ కొడుకుల ఆలోచన మరోలా ఉంది. అసలు తండ్రికి డబ్బు ఎందుకు ఇవ్వాలి మొత్తం మనమే తీసుకోవచ్చుగా అని ఆలోచన చేశారు.
కొడుకుల బుర్రలో పుట్టిన క్రూరపు ఆలోచన ఆ తండ్రి మరణానికి దారి తీసింది. కుమారులు ముందే భూమి కొంటున్న వ్యక్తితో ఒప్పందం చేసుకున్నారు. డబ్బు మొత్తం నేరుగా కుమారులకే ఇచ్చేలా మాట్లాడుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న తండ్రి రిజిస్ట్రేషన్ రోజున సంతంకం పెట్టేందుకు నిరాకరించాడు. కోపంతో ఊగిపోయిన కుమారులు కత్తులతో తండ్రిని దారుణంగా పొడిచి పరారయ్యారు. తండ్రిని మైసూరులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరికాళయ్య మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.