భార్యను హత్యచేసేందుకు ఆమెకు యాసిడ్ తాగించి.. వివస్త్రను చేసి గదిలో నిర్బంధించిన అత్యంత కిరాతకమైన.. దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. భార్య పేరుపై ఉన్న ఆస్తుల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. నిందితుడు ఎవరో కాదు.. ఒక మంచి హోదాలో ఉన్న ప్రభుత్వ ఇంజినీర్ అధికారి.
వివరాల్లోకి వెళితే.. ధర్మనాయక్- పద్మ భార్యాభర్తలు. ధర్మనాయక్ నాగార్జున సాగర్ SEగా విధులు నిర్తిస్తున్నాడు. 2008లో ఇరిగేషన్ సర్కిల్ అధికారిగా ఉన్న సమయంలో అక్రమ ఆస్తుల ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అధికారులు సోదాలు చేసి.. పలు ఆస్తులను అటాచ్ చేశారు. అప్పటి నుంచి ధర్మనాయక్ కు ఆర్థికంగా కాస్త కష్టాలు మొదలయ్యాయి. భార్య పేరు మీదున్న ఆస్తుల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అతని భార్య ఆరోపిస్తోంది. భర్త నుంచి తనను రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించింది.
జనవరి 4న తన భర్త, అతని తల్లి, సహచరులు అంతా కలిసి తనకు యాసిడ్ తాగించారని. పారిపోకుండా ఉండేందుకు వివస్త్రను చేసి గదిలో బంధించారని ఆరోపించింది. వారి నుంచి తప్పించుకుని సకాలంలో వైద్యం పొందడం వల్ల తాను బతికినట్లు తెలిపింది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎలాగైనా రక్షించాలంటూ పోలీసులను వేడుకుంది.