ఈ మద్య కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. చిన్న చిన్న సమస్యలకే మనస్థాపానికి గురి అవుతున్నారు.. ఆ సమయంలో క్షణికావేశంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన బాలుడు అదృశ్యమైన ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ మొగిలిచర్ల రవి వివరాల ప్రకారం.. విద్యానగర్ మణిసదన్ అపార్ట్‌మెంట్‌లో అవగాన్ అజయ్‌కుమార్ కుటుంబ నివాసముంటుంది. వారి కుమారుడు అవగాన్ కార్తీక్‌కుమార్. అయితే పుట్టినప్పటి నుంచి కార్తీక్ ని ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు తల్లిదండ్రులు.
తమ కొడుకు ఫస్ట్ ర్యాంక్ లో ఉండాలని ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో స్థానిక నారాయణ స్కూల్‌లో ఏడవ తరగతి చదువున్న కుమారుడు అవగాన్ కార్తీక్‌కుమార్ గత కొద్ది రోజులుగా తన స్కూల్ డైరీని చూపించడం లేదు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తండ్రి మందలించాడు. ఎప్పుడూ తనపై సీరియస్ కాని తండ్రి ఒక్కసారే అంతలా మందలించడంతో కార్తీక్‌కుమార్ మనస్థాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం పాల ప్యాకెట్ తీసుకువస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన కార్తీక్ సాయంత్రం వరకు తిరిగి రాలేదు. తమ కుమారుడి ఆచూకి కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో అజయ్‌కుమార్ శుక్రవారం సాయంత్రం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవగాన్ కార్తీక్‌కుమార్ ఆచూకి తెలిస్తే మొబైల్: 9490616373 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.