అతి వేగం ప్రమాదకరం, మద్యం సేవించి వాహనం నడపరాదు అని ఎన్ని విధాలుగా అధికారులు ప్రచారం చేసిన కొందరు మారటం లేదు. ఆ నిర్లక్ష్యమే వారి ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఆ కోవలోనే తాజాగా గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్లిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే..ఎన్.మానస(23), ఎం.మానస(21) అనే ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు అమీర్ పేట్ లోని హాస్టల్ లో ఉంటున్నారు. ఉదయం షూటింగ్ ఉందని అబ్దుల్ అనే ఓ బ్యాంకు ఉద్యోగితో కలసి కారులో గచ్చిబౌలి జేవి కాలనిలో ఉండే సాయి సిద్దు అనే మరో ఆర్టిస్టు ఇంటికి చేరుకున్నారు. అక్కడే నలుగురూ మద్యం తీసుకున్నట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి టీ తాగడానికి లింగంపల్లి వైపు వెళ్తున్న సమయంలో కారు అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎన్. మానస, ఎం.మానసలతో పాటు ఆ బ్యాంకు ఉద్యోగి మరణించాడు. సిద్ధు కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.