హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. తనను దొంగ దొంగ అనడం భరించలేని ఓ యువకుడు.. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను దొంగను కాదు నమ్మండి అంటూ ఆవేదనతో ప్రాణాలు విడిచాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
పోలీసుల వివరాల మేరకు.. ఫిలింనగర్ లోని దీన్ దయాళ్ నగర్ లో నివసించే బొల్లం శివరాం(30) మణికొండలోని రిలయన్స్ జియో మార్ట్ హబ్ లో పని చేస్తున్నాడు. ఇటీవల ఆ జియో మార్ట్ హబ్ లో రూ.2 లక్షలు కనిపించకుండా పోయాయి. అక్కడ పనిచేసే సంతోష్ అనే ఉద్యోగి ఆ నిందను శివరాంపై మోపాడు. నువ్వే ఆ దొంగతనం చేశావంటూ శివరాంను నిందించాడు. దొంగ అనే నిందతో శివరాం మానసికంగా కుంగి పోయాడు. తాను దొంగను కాదంటూ ఎన్నోసార్లు మొర పెట్టుకున్నాడు. కానీ, ఎవరూ అతని మాటలను పట్టించుకోలేదు.
తాను అలాంటి వాడిని కాదంటూ చెప్పి విసిపిగిపోయిన శివరాం.. మనస్తాపంతో గురువారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాశాడు. తనను దొంగ అనడం.. రూ.2 లక్షలు కట్టాలంటూ ఒత్తిడి తీసుకురావడం తట్టుకోలేకపోతున్నానంటూ నోట్ లో చెప్పాడు. తాను ఒక్క రూపాయి కూడా తీయలేదని.. ఈ మానసిక క్షోభ తట్టుకోలేకపోతున్నానంటూ తెలిపాడు. ఆ లెటర్ చదివిన మృతుడి భార్య మీనాక్షి పోలీసులకు ఈ సమాచారమిచ్చింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. జియో మార్టు హబ్ నిర్వాహకుడు సంతోష్ పై కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు. చెయ్యని తప్పుకి తన భర్త ప్రాణాలు పోయాయని తమకు న్యాయం చేయాలంటూ మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.