ఈరోజుల్లో పెళ్లి, మూడు ముళ్ల బంధానికి ఉన్న విలువ తగ్గిపోతోంది అనే భావనకు ఎంతో మంది వస్తున్నారు. కట్టుకున్న భార్య ఉన్నా పక్కింటి పుల్లకూర రుచి కోసం పాకులాడుతున్నారు. కొందరు చీకటి సంబంధాలు పెట్టుకుని భార్యను మోసం చేస్తుంటే.. ఇంకొందరు అర్ధాంగిని గాలి కొదిలేసి మరో పెళ్లి చేసుకుని కాలం గడిపేస్తున్నారు. అలా మోసపోయిన ఓ మహిళ.. భర్త ఇంటి ముందు 40 రోజులు ఒంటరి పోరాటం చేసింది. ఎలాగైన భర్తను దక్కించుకుంటానని పోరుకు దిగిన ఆమె చివరికి అతను వేరే మహిళను వివాహం చేసుకున్నాడని తెలిసి ఆత్మాహత్యకు యత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
పోలీసుల కథనం ప్రకారం.. హుజూరాబాద్ కు చెందిన నరహరి సుజిత్ రెడ్డి కడపకు చెందిన సుహాసిని రెడ్డి(32)కి 11 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆన్ లైన్ ఏర్పడ్డ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని సుహాసిని కోరిన ప్రతిసారి సుజిత్ నిరాకరిచేవాడు. సుజిత్ ప్రవర్తన చూసి భయాందోళనకు గురైన సుహాసినిరెడ్డి అతడిని పెళ్లి విషయంలో ఒత్తిడి చేసింది. చేసేది లేక 2020లో ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. కొన్నాళ్లు కలిసి ఉన్నారు.
ఆ తర్వాత తమ పెద్దవాళ్లను ఒప్పిస్తానని చెప్పి ఊరెళ్లి తిరిగి రాలేదు. అతడిని వెతుక్కుంటూ సుహాసిని హుజూరాబాద్ చేరుకుంది. భర్త ఇంటి ముందు బైఠాయించింది. అత్తమామలు, భర్త చేరదీయకపోవడంతో అక్కడే 40 రోజుల పాటు ఒంటరి పోరాటం చేసింది. ఆ తర్వాత భర్త వేరే మహిళను వివాహం చేసుకున్నాడని తెలిసుకుంది. మోసపోయినట్లు గ్రహించి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె చావుకు తన భర్త వేరే పెళ్లి చేసుకోవడమే కారణం అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొంది. తన చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి, తన అవయవాలను దానం చేయాలని కోరింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.