అప్పులు ఇస్తే శత్రువులను కొన్ని తెచ్చుకోవడమేనని కొందరు చెబుతుంటారు. అన్ని సందర్భాల్లో కాకపోయిన కొన్నిసార్లు అది వాస్తవమే. అప్పుల కారణంగా అనేక ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది
సాధారణంగా ఎవరికైనా అప్పు ఇస్తే అది జీవితంలో చేసిన పెద్ద తప్పు అని కొందరు చెప్తుంటారు. ఎందుకంటే అప్పు అడిగే సమయంలో ఎంతో ప్రేమగానే మాట్లాడుతారు. కానీ తిరిగి ఇవ్వమన్నప్పుడే కొందరు రౌడీయిజం ప్రదర్శిస్తుంటారు. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే శత్రువులా చూస్తుంటారన్న విషయం తెలిసిందే. అంతేకాక మరికొందరైతే తీసుకున్న అప్పు ఎగ్గొట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అప్పు ఇచ్చిన వారు, తీసుకున్న వారి మధ్య గొడవలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇరువురి మధ్య భౌతిక దాడులు కూడా జరుగుతుంటాయి. ఇంకా దారుణం ఏమిటంటే ఈ అప్పుల కారణంగా హత్యలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి తాను ఇచ్చిన అప్పును తీర్చమనడమే నేరమైంది. ఆ యువకుడి ఇచ్చిన డబ్బులు ఇవ్వక పోగా కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్ కు చెందిన వెంకట్ అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ కు వచ్చి స్థిరపడ్డాడు. అక్కడే అద్దె ఇంట్లో నివాసం ఉంటూ స్థానిక రైతుల ట్రాక్టర్లకు డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. అలా రైతుల ట్రాక్టర్లకు డ్రైవర్ గా పనిచేస్తూ కొంత డబ్బు కూడబెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఓ అమ్మాయితో వెంకట్ కు వివాహం జరిగింది. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుని కొత్త కాపురంలోకి వెంకట్ అడుపెట్టాడు. ఇలా తన పని చేసుకుంటూ భార్యతో వెంకట్ సంతోషంగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మోర్తాడ్ కు చెందిన శేఖర్ అనే వ్యక్తి వెంకట్ వద్ద కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు.
ఇటీవల తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని వెంకట్..శేఖర్ ను కోరాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా వాగ్వాదం కొనసాగుతోంది. మంగళవారం రాత్రి డబ్బులు ఇస్తానని చెప్పి వెంకట్ ను గ్రామ శివారుకు పిలించాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో మరోసారి డబ్బుల విషయంలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరు ఒకరిపై మరొకరు భౌతిక దాడి చేసుకున్నట్లు సమాచారం. ముందుగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో వెంకట్ మెడపై శేఖర్ పొడిచాడు. అనంతరం కత్తిపోటు తీవ్రంగా గాయపడిన వెంకట్ కుప్పకూలిపోయాడు.
హత్య చేసిన అనంతరం ఘటన స్థలం నుంచి శేఖర్ పారిపోయాడు. వెంకట్ మృతితో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇచ్చిన అప్పు తిరిగి అడగడమే అతడు చేసిన నేరమా? అని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా క్షణికావేశంలో కొందరు వ్యక్తులు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.