పై ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు శివరంజని(28). కుటుంబంతో కలసి ఎంతో సంతోషంగా జీవిస్తుంది. గర్భవతి అయినా ఆ మహిళ.. అబార్షన్ కోసం ఓ ఆర్ఎంపీ వైద్యుడిని కలిసింది. అతడిని కలవడమే శివరంజని చేసిన తప్పులా ఉంది. ఆర్ఎంపీ ఇచ్చిన వైద్యం వికటించి రంజని మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేటలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
వరంగల్ జిల్లా చెన్నారావు పేటలోని నవంబర్ కాలనీలో కన్నం శివరంజని అనే వివాహిత తన కుటుంబంతో కలసి నివాసం ఉంటుంది. స్థానికంగా పనులు చేసుకుంటూ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తోంది. అయితే గర్భవతి అయినా ఆమె అబార్షన్ కోసం రెండు నెలల క్రితం స్థానికంగా ఉండే ఆర్ఎంపీని సంప్రదించింది. ఆ సమయంలో సదరు ఆర్ఎంపీ అబార్షన్ కోసం శివరంజని కి కొన్ని మాత్రలు ఇచ్చాడు. వాటిని తీసుకున్న తరువాత రంజనికి రక్తస్రావం బాగా జరిగింది. దీంతో శివరంజనికి అధిక రక్తస్రావం అవుతున్న విషయాన్ని కుటుంబ సభ్యులు ఆర్ఎంపీకి సమాచారం అందించారు.
అతడు వచ్చి.. ఇంజక్షన్ ఇచ్చినా రక్త స్రావం ఆగలేదు. దీంతో ఈనెల 11న నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వరంగల్ లోని సీకేఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు 13వ తేదీన మహాత్మగాంధీ ఆసుపత్రికి సిఫారసు చేశారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ శివరంజని ఆదివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఆర్ఎంపీపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారణాలు ఏమైనప్పటికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. శివరంజని మృతితో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.