నేటికాలంలో చాలా మంది యువతలో ఆత్మవిశ్వాసం అనేది లోపిస్తుంది. ప్రతి సమస్యను పెద్దదిగా భావించి భయపడిపోతుంటారు. అలానే ఎవరికి రాని సమస్యలు తమకే వచ్చాయని తమలో తామే మధన పడిపోతుంటారు. ఇలాంటి సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనైనా కొందరు యువత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివిధ కారణలతో జీవితంపై విరక్తి చెంది.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా పీజీ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని.. ఆమె తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం కాపువీధి ప్రాంతానికి చెందిన నున్న మాధురి(22) జ్ఞానాపురంలో ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ చదువుతుంది. అలానే ఆ కాలేజికి సంబంధించిన వసతి గృహంలోనే మాధురి ఉంటుంది. అయితే ఆమె ఇటీవలే సంక్రాంతి పండగ సెలవులకు మాధురికి సొంతూరికి వెళ్లింది. అక్కడ తల్లిదండ్రులతో, బాల్య స్నేహితులకు సంతోషంగా గడిపింది. తిరిగి బుధవారం కాలేజికి వచ్చినట్లు కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మాధురి క్లాస్ లకు హాజరు కాలేదు. చాలా సమయం పాటు మాధురి కోసం ఎదురు చూసిన స్నేహితులు.. ఆమె కోసం హాస్టల్ కి వెళ్లారు. ఈ క్రమంలో మాధురి ఉండే గది తలుపు తెరవగానే వారు ఒక్కసారిగా షాకయ్యారు. తన గదిలో ఆ పీజీ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కనిపించింది. తోటి విద్యార్థినిలు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కు తెలియజేశారు. దీంతో హుటాహుటిన ఆ గదికి చేరుకున్న కాలేజీ సిబ్బంది ఆమెను కిందకి దించి చూడగా.. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.
దీంతో వారు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో … వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తోటి విద్యార్థులను, కాలేజి సిబ్బందిని అడిగి కేసు వివరాలు నమోదు చేసుకున్నారు. మాధురి మరణవార్త తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ బిడ్డకు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమీ లేవని, మరీ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్ధం కావడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు మృతురాలి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం కేజీహెచ్ కి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూతపంలో తెలియజేయండి.