తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా, హాయిగా, ఉన్నతస్థితిలో గడపాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరీ ముఖ్యంగా చదువుకునే యువత.. తాము బాగా కష్టబడి చదువుకుని.. జీవితంలో బాగా స్థిరపడాలని కోరుకుంటారు. అందుకు తగినట్లే కొందరు పట్టుదలతో కష్టపడి తమ లక్ష్యానికి అందుకుంటారు. అయితే కొందరి జీవితాలను మాత్రం దేవుడు తలక్రిందులు చేస్తాడు. తాజాగా బీటెక్ చదువుతున్న ఓ యువతి జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఓ ఘటనతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న మంచంపైనే ఆ యువతి సజీవ దహనమైనది. తాను ఎలా చనిపోయానో అని తెలియకుండా.. యువతి దహనమైంది. ఈ ఘటన పశ్చిమ గోదావి జిల్లాలోని తణుకు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్ , వసంత భార్యభర్తలు. వీరిద్దరికి హారిక(19) అనే కుమార్తె ఉంది. అయితే హారిక తల్లి వసంత 2003లో మృతి చెందింది. దీంతో శ్రీనివాస్ 2009లో రూప అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం హారిక బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కాగా శ్రీనివాస్.. తన భార్య వసంతకు పుట్టింటి నుంచి రావాల్సిన ఆస్తి కోసం కొన్నాళ్ల కిందట కోర్టును ఆశ్రయించాడు. ఇక అప్పటి నుంచి కోర్టులో వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత మంచంపై నిద్రిస్తున్న హారిక సజీవ దహనమైంది. హారిక అమ్మమ్మ ఇంటి వారితో కోర్టు కేసులు నడుస్తున్న సమయంలో హారిక మృతి అనుమాలకు తావిస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలోని పరిసరాలను పరిశీలించి వివరాలు సేకరించారు.
అయితే చరవాణికి ఛార్జింగ్ పెడుతుండగా షార్టు సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగిందని హారిక తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్నికి పోస్టు మార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించి.. అనుమానాస్పద స్థితి మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ మృతిపై హారిక అమ్మమ్మ వాళ్లు పలు ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకాలం ఆస్తి కోసమే హారికపై ప్రేమ ఉన్నట్లు నటించి, తీర్పు తమకు అనుకూలంగా రాదనే ఉద్దేశంతో హత్య చేసి కరెంట్ షార్ట్ సర్క్యూట్ గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మృతురాలి మేనమామ, అమ్మమ్మలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తప్పు ఎవరిదైనా, అసలు ఏం జరిగినా.. ఓ చదువుల తల్లి సరస్వతి జీవితం మాత్రం అర్ధాంతరంగా ముగియడం గ్రామస్థులు మనస్సు కలచివేసింది.