తమ బిడ్డను మంచి ఉన్నతమైన కుటుంబానికి కోడలుగా పంపాలని ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం తమ కష్టాన్ని కట్నం రూపంలో అల్లుడికి ఇచ్చి అమ్మాయిని అత్తింటికి పంపిస్తారు. ఈక్రమంలో కొందరు అల్లుడ్లు మాత్రం అదనపు కట్నం తేవాలని హింస్తుంటారు. మరికొందరు ప్రతి చిన్న విషయానికి భార్యతో గొడవపడుతుంటారు. చివరికి భార్యను హతమార్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తాజాగా తిరుపతిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్యను చంపి సూట్ కేసులో పెట్టి చెరువులో పడేశాడు. ఐదునెలల క్రితం జరిగిన ఈ ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
తిరుపతికి చెందిన పద్మకు సాఫ్ట్ వేర్ ఇంజనీరైనా వేణుగోపాల్ తో 2009లో వివాహం జరిగింది. కొన్నేళ్ల పాటు వీరి సంసారం హాయిగా సాగింది. అయితే ఇటీవల కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వేణు నాలుగు నెలల నుంచి పద్మను హింసించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులకు విసిగిపోయిన పద్మ.. అతడి నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇరుకుటుంబాల పెద్దలు వారిద్దరికి నచ్చచెప్పి పంపించారు. అయినా పద్మ నిర్ణయంలో మార్పురాలేదు. ఈక్రమంలో వేణుగోపాల్ ఆమెను హింసించి.. చంపేశాడు.అనంతరం ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి రేణుగుంట సమీపంలోని వెంకటాపురం వద్ద ఉన్న చెరువులో పడేశాడు. అనంతరం అతడే వెళ్లి తన భార్య కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐదు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పద్మ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టి హింసించడం వల్లేనే ఆమెను చంపేసినట్లు మృతురాలి భర్త తెలిపాడు.