సైబర్ మోసాల గురించి నిత్యం అనేక వార్తలు వస్తుంటాయి. తాము భారీ మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నామని ఎందరో ఆవేదన చెందడం మనం చూశాం. అలానే సైబర్ కేటుగాళ్లు భారీ బహుమతులు, లాటరీ అంటూ ఆశల వల వేసి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తుంటారు. ఇలా అడ్డుఅదుపూ లేని సైబర్ నేరగాళ్ల మోసాలకు అమాయక ప్రజలు బలవుతున్నారు. సైబర్ నేరాలపై, సాంకేతికత విషయాలపై కాస్తో కూస్తో అవగాహన ఉన్న కొందరు ప్రజలు ఇప్పుడిపుడే సైబర్ నేరాల నుంచి తప్పించుకోగలుగుతుండగా మరికొందరు కేటుగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా బంగారం, బహుమతులకు ఆశపడ్డ ఓ మహిళ.. సైబర్ కేట్లుగాళ్ల మాయలో పడి మోసపోయింది. ఆమె నుంచి రూ.1.12 కోట్లు చోరీ చేశారు. ఈ ఘటన మహారాష్ట్ర లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని రాయ్ గఢ్ కి చెందిన ఓ మహిళ ..కోర్టు సూపరింటెండెంట్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తన కుటుంబ సభ్యులతో జీవిస్తూ కాలం వెలదీస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వాడకంపై బాగా అవగాహన ఉన్న ఆమె..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. ఈక్రమంలో సామాజిక మాద్యమంలో సదరు మహిళకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను బ్రిటన్ లోని మాంచెస్టర్ లో ఉంటున్నట్లు చెప్పాడు. ఆమెతో కొంతకాలం పాటు స్నేహం పెంచుకున్నాడు. దీంతో అతడిపై ఆ మహిళకు నమ్మకం ఏర్పడింది. ఇటీవలే ఆమెకు ఫోన్ చేసి.. బంగారం, విలువైన బహుమతులతో పాటు డబ్బు పంపిస్తున్నాని చెప్పాడు. అయితే వాటిని తీసుకోవాలంటే మీరు కొంత కస్టమ్స్ సుంకం చెల్లించాలంటూ బురిడీ కొట్టించాడు. ఆ మహిళ..అతడు చెప్పిన ఓ ఖాతకు రూ.1.12 కోట్లు బదిలీ చేసింది. ఆ తరువాత అతడికి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో తాను మోసపోయినట్లు మహిళకు అర్ధమైంది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి పిర్యాదు చేసింది.