సంసారంలో గొడవలు జరగడం అనేది సర్వసాధారణం. కానీ కొన్ని సార్లు అవి శృతిమించినప్పుడు అనర్ధాలకు దారితీస్తాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధం, మద్యానికి బానిసగా మారడం వంటి కారణాలతో సంసారం మంటగలిసిపోతుంది.
భార్యాభర్తల బంధంలో చిన్న గొడవలు అనేవి సర్వసాధారణం. అయితే ఈ సంసారం బంధంలో కొన్ని చెడు అలవాట్లు చేరి జీవితాలను నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధం, మద్యానికి బానిస కావడం వంటి కారణాలతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుంటాయి. కొందరు నిత్యం మద్యం తాగొచ్చి ఇంట్లో భార్య పిల్లలను వేధిస్తుంటారు. అంతేకాక భార్యను విచక్షణ రహితంగా కొట్టి హింసిస్తుంటారు. అయినా సమాజం కోసం, పిల్లల కోసం ఆడవాళ్లు భర్తపెట్టే వేధింపులన భరిస్తుంటారు. కొందరు ఆడవారు సహనం కోల్పోయిన సందర్భంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఓ ఇల్లాలు కూడా వేధింపులకు గురిచేస్తున్న భర్త విషయంలో దారుణమైన నిర్ణయం తీసుకుంది. సోదరుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట మండలం పెద్దకరగాం గ్రామానికి చెందిన చంద్రభూషణ(35)కు ఎచ్చెర్ల మండలంలోని తోటపాలేనికి చెందిన భాగ్యలక్ష్మితో 2010లో వివాహమైంది. చంద్రభూషణ, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలా కాలంపాటు వీరి సంసారం ఎంతో సంతోషంగా సాగింది. చంద్ర భూషణ మద్యానికి బానిసగా మారి రోజూ తాగి వచ్చి గొడవ పడేవాడు. భాగ్యలక్ష్మి ఎన్నిమార్లు నచ్చజెప్పినా వినేవాడు. ఇలా సాగుతున్న క్రమంలో మంగళవారం మధ్యాహ్నం తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. హత్య ఘటనపై విచారణ చేయగా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఈ హత్య కేసులో నిందితులు చంద్రభూషణ భార్య భాగ్యలక్ష్మి , బామ్మర్ధి శివనారాయణే అని తేలింది. చంద్రభూషణ తరచూ మద్యం తాగి ఆమెను వేధించే వాడని, అలానే ఆమెపై దాడికి పాల్పడే వాడు. అయినా పిల్లల కోసం అతడి వేధింపులను భరిస్తూ వచ్చింది భాగ్యలక్ష్మి. గత రెండు రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
ఇక భర్త వేధింపులకు విసుగు చెందిన భాగ్యలక్ష్మి తోటపాలెంలో ఉన్న సోదరుడు శివకు సమాచారం ఇచ్చింది. ఆమె సోదరుడు ఇంటికి వచ్చి రాగానే మద్యం మత్తులో ఉన్న బావపై దాడి చేశాడు. ఇద్దరు కలసి కర్రలతో చంద్రభూషణను కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక చంద్రభూషణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు 108 సమాచారం అందించగా, వారు వచ్చి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.