‘ఏమైపోతుంది సభ్య సమాజం.. ఏమైపోతుంది మానవ హృదయం’ అని ఓ కవి అన్నట్లు నేటి పరిస్థితులు దాపురించాయి. 2012 లో యుగాంతం వచ్చి ప్రపంచం అంతమైపోతుందని అంతా అనుకున్నారు. భూమి మీద మనిషి మనుగడ లేకుండా పోతుందని భయపడ్డారు. కానీ నేటి పరిస్థితలు చూస్తుంటే యుగాంతం మనుషులకు కాదు.. మనుషుల్లోని మానవత్వానికి వచ్చినట్లు అనిపిస్తోంది. ఆడవాళ్లు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, హత్యలు, ప్రేమోన్మాదులు దాడులు వంటి ఘటనలు కొందరి మనషుల్లోని మానవత్వం చచ్చిపోయిందనటానికి నిదర్శనాలు గా నిలుస్తున్నాయి. పోలీసులకు పట్టించిన పాపానికి తాజాగా ఓ మహిళను నగ్నంగా వీధుల్లో తిప్పాడు ఓ దొంగ. ఈ ఘోరాన్ని గ్రామస్థులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారే కానీ ఎదరించలేదు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ లోని మైహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్ నాలో ఓ మహిళ తన భర్తతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కొన్ని రోజుల క్రితం నలుగురు దొంగలు వీరి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో నిద్రిస్తున్న ఆ దంపతులు లేవడంతో అక్కడ నుంచి ముగ్గురు దొంగలు పారిపోయారు. అయితే ఆ నలుగురిలోని రితేష్ అనే దొంగ మాత్రం వారి చిక్కాడు. దీంతో అతడి పట్టుకుని సదరు మహిళ పోలీసులకు అప్పగించింది. అతడి అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు. తనను జైలుకు పంపిన ఆ దంపతులపై ఆ నిందితుడు పగ పెంచుకున్నాడు. కొంతకాలం జైల్లో గడిపిన నిందితుడు రితేష్ ఇటీవల విడుదలయ్యాడు. అనంతరం కొందరు స్నేహితులతో కలిసి ఆ దంపతుల ఇంటికి చేరుకున్నాడు. భర్తను కట్టేసి ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.
ఆమె బట్టలు విప్పి.. నగ్నంగా ఊరంతా ఊరేగించాడు. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ఏ ఒక్కరు ముందుకు రాలేదు. కాపాడలని ఆ బాధిత మహిళ వేడుకున్న అక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరి హృదయం కరగలేదు. ఈ దుశ్చర్యను గ్రామస్థులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు తప్ప ఒక్కరూ ఆ మహిళను కాపాడే ప్రయత్నం చేయలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు పోలీసులును కోరింది.