మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మనందరికి తెలిసిన విషయమే. ఈ మద్యం కారణంగా కేవలం ఆరోగ్యాలు పాడవమే కాదు.. ఎన్నో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మద్యం వలన అనేక పచ్చని సంసారంలు నిట్టనిలువునా తగలబడిపోతున్నాయి. మద్యానికి బానిసలైన వారిలో కొందరు మృగంలా ప్రవర్తిస్తున్నారు. మద్యం మైకంలో అత్యాచారాలు, హత్యలకు తెగబడుతున్నారు. ఈ మద్యం భూతం కారణంగా జరిగిన ఘోరాలను అనేకం చూశాం. తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. భార్యను, అత్తను వేట కొడవలితో అత్యంత దారుణంగా నరికి చంపేశాడు. ఒళ్లు గగ్గురు పుట్టించే ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం జాలవాడికిలో నాగరాజుకు ఆదోని చెందిన కురువ బీమక్క అలియాస్ లక్షమ్మ కుమార్తె శాంతితో పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. నాగరాజు స్థానికంగా విద్యుత్తు పనులు చేస్తుంటాడు. మద్యానికి బానిసగా మారిన నాగరాజు.. నిత్యం ఇంట్లో గొడవలు పడుతుండేవాడు. నిత్యం తాగి వచ్చి శాంతి తో గొడవ పడటమే కాకుండా పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలంటూ వేధిస్తున్నాడు. చాలాకాలం పాటు అతడి వేధింపులను భరిస్తూ వచ్చిన శాంతి.. నెల రోజుల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. దాదాపు ఇరవై రోజులైనా కూడా శాంతి తిరిగి అతడి వద్దకు వెళ్లలేదు.
దీంతో నాగరాజు అత్తారింటికి వెళ్లి, బావమరుదులతో మాట్లాడి.. మరోసారి తాను తాగనని మాటిచ్చాడు. అలా అత్తింటి వారిని ఒప్పించుకుని శాంతిని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికొచ్చాక అతనిలో ఎటువంటి మార్పు రాకపోగా.. తిరిగి తాగి శాంతిని వేధించడం ప్రారంభించాడు. ఇలా జరుగుతున్న క్రమంలో శాంతి కుమార్తెకు ఆటమ్మ సోకింది. ఈ నేపథ్యంలో మనవరాలిని చూసేందుకు లక్షమ్మ శుక్రవారం జాలవాడికి వచ్చారు. ఆ సమయంలో కూడా నాగరాజు శాంతితో ఘర్షణకు దిగాడు. తన కూతురుతో గొడవ పడుతుండటం చూసిన లక్షమ్మ.. అల్లుడిని మందలించారు. ఈ క్రమంలో అత్త, అల్లుడి మధ్య మాటామాటా పెరిగింది.
కోపోద్రికుడైన నాగరాజు వేట కొడవలితో పిల్లల ఎదుటే శాంతిపై దాడి చేశాడు. కూతురుపై దాడి చేస్తున్న అల్లుడిని లక్షమ్మ అడుకునే ప్రయత్నం చేయగా.. ఆమెనూ నరికాడు. రక్తపు మడుగులో తల్లీకూతుళ్లు ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. విగత జీవులుగా పడి ఉన్న తల్లి, అమ్మమ్మను చూసి పిల్లలు భీతిల్లారు. తమ తల్లిని, అమ్మమ్మను తమ తండ్రే చంపినట్లు పిల్లలు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోరానికి ఒడిగట్టిన నాగరాజు పరారీలో ఉన్నాడు. మరి.. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.