కొన్నేళ్ల నుంచి ఆడవారు చిత్ర హింసలకు గురవుతునే వస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న నేటికాలంలో కూడా వారు అనేక రకాల వేధింపులకు గురవుతున్నారు. లైంగిక, వరకట్నం వంటి వేధింపులతో ఆడపిల్లలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఇలా అనేక రకాల వేధింపులతో చిత్ర హింసలకు గురవుతున్న మహిళల్లో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు అనుమానస్పద స్థితిలో మృతి చెందుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీస్ శాఖలోన స్పెషల్ బ్రాంచ్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ భార్య అనుమానస్పద స్థితిలో మరణించింది. అయితే తమ కూతురిని అత్తింటి వారే కట్నం కోసం చిత్ర హింసలు పెట్టి.. చంపేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు..
కర్నూలు పట్టణంలోని ఆదిత్య నగర్ కు చెందిన రిటైర్డ్ ఎస్సై నాగన్న రెండో కుమార్తె వినీలను జిల్లా పోలీసు శాఖ స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ చిరంజీవికి ఇచ్చి.. 2012 ఫిబ్రవరి 12న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నంగా నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షలు క్యాష్ ఇచ్చారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే పెళ్లైన కొంతకాలం పాటు వీరి సంసారం ఎంతో సంతోషంగా సాగింది. ఆ తరువాత కొంతకాలం నుంచి అదనపు కట్నం కోసం వినీలను.. ఆమె భర్తతో పాటు అత్తింటి వారు మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని సమాచారం.
అదనపు కట్నం తీసుకురాకుంటే మరో పెళ్లి చేసుకుంటానని చిరంజీవి బెదిరించే వాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే 2019 వినీల తండ్రి పదవి విరమణ చేసిన సమయంలో రూ.5 లక్షలు వచ్చాయి. వాటిని అల్లుడు చిరంజీవికి వినీల కుటుంబ సభ్యులు ఇచ్చారు. ఆ డబ్బులు వచ్చిన కొన్ని రోజుల పాటు వీరి సంసారం బాగానే సాగినా.. మళ్లీ మొదటికొచ్చింది. భర్త చిరంజీవితో పాటు అత్తింటి వారు వినీలను చిత్రహింసలకు గురిచేయడం తిరిగి ప్రారంభించారు. తన బాధను తల్లిదండ్రులకు చెప్పుకోగా.. పిల్లల కోసం సర్థుకు వెళ్లమని వారు చెప్పేవారు. ఈ క్రమంలో గురువారం రాత్రి వినీల ఇంట్లో ఉరేసుకోగా కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వినీలను పరీక్షించిన వైద్యులు.. ఆమె మరణించినట్లు నిర్ధారించారు. అయితే తమ కుమార్తె మృతిపై అనుమానం ఉందని, ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వినీల మృతిపై అనుమానం ఉందంటూ ఆమె తండ్రి నాగన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారణం ఏదైనా ఓ నిండు జీవితం అర్ధాంతరం ముగిసిపోయింది. మరి.. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.