అన్ని జన్మల్లో కెల్లా అరుదైన జన్మ.. మనిషి జన్మ. ఇది చాలా అరుదుగా వస్తుంది. అందులోనూ మిగిలిన జీవాలతో పోలిస్తే మనిషి చాలా ప్రత్యేకమైన వ్యక్తి. మిగిలిన వాటి కంటే ఎంతో తెలివిగా, కొత్త కొత్త విషయాలను కనిపెట్టడం, ఏది తప్పు ఏది ఒప్పో గుర్తించగల ప్రత్యేక గుణం మనిషికి మాత్రమే ఉంటుంది. అయితే ఇంత ప్రత్యేకమైన మనిషి.. కేవలం సమస్యలను చూసి భయపడి పోతున్నాడు. ఏ మూగజీవాలకు రాని ఆత్మహత్య అనే ఆలోచన మనిషి చేస్తున్నాడు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు బయపడి.. కొందరు చావే పరిష్కారంగా భావిస్తారు. అందుకే కుటుంబ సభ్యులను అనాథలను చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ కూడా ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆవేదనకు లోనైన ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుమారుడు తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలిపోయాడు. ఈ విషాదరక సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కె.ఆర్.పురం ప్రాంతంలో సౌందర్య(24) అనే మహిళ తన భర్తతో కలిసి నివాసం ఉండేది. వారిద్దరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. సౌందర్య భర్త.. నగరంలోని మాగడి రోడ్డులో ఒక ఆడిటర్ వద్ద జీఎస్టీ లెక్కలు చూసేవాడు. ఇలా భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉంటుండేవారు. సౌందర్యను ఆమె భర్త ఎంతో ప్రేమగా చూసుకునే వాడు. అయితే వివిధ కారణాలతో సౌందర్య భర్త రూ.3 కోట్ల వరకూ అప్పులు చేశాడు. అయితే అప్పులు ఇచ్చిన వాళ్లు అతడి అడటం మొదలు పెట్టారు. ఈక్రమంలో అప్పుల వాళ్ల బాధలు పడలేక 15 రోజుల క్రితం తన ఆఫీసులో ఉరి వేసుకున్నాడు. ఆఫీస్ వెళ్తున్న అని చెప్పి..బయటకు వెళ్లిన భర్త విగతజీవిగా మారడంతో సౌందర్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇలా భర్త దశదినకర్మలు సైతం నిర్వహించి.. అనంతరం పుట్టింటికి వెళ్లింది. తన బాబుతో అక్కడే ఉంటూ ఉంది.
అయితే ప్రతీక్షణం తన భర్త జ్ఞాపకాలను తలచుకుని సౌందర్య లోలోపల కుమిలిపోయేది. భర్త తనపై చూపించిన ప్రేమను తలచుకుని మానసికంగా కుంగిపోయేది. హాయిగా సాగుతున్న తమ సంసారంలో ఎందుకు దేవుడు చీకటి నింపాడు అంటూ మనోవేదనకి గురైంది. ఇప్పుడు తనకు, తనబిడ్డకు ఆధారం ఎవరుంటారంటూ ఏడుస్తుండేది. భర్తలేని జీవితం తనకు వ్యర్థం అని భావించిన సౌందర్య..తాను చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 15 రోజుల క్రితం తండ్రి మరణించగా, ఇప్పుడు తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుమారుడు అనాథగా మారాడు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. అక్కడ పరిశీలించారు..కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.