ప్రస్తుతం నడుస్తున్నది సాంకేతిగ యుగం. ఈ కాలంలో ఆడమగ అనే బేధం లేదు. మహిళలు సైతం మగవారికి పోటీగా అన్నీ రంగంలో దూసుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని రంగాల్లో మగవారి కంటే వారే చాలా ముందు ఉన్నారు. ఇంతలా స్త్రీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న కూడా ఎక్కడో ఒకచోట ఆడవారు వివక్షతకు గురవుతూనే ఉన్నారు. ఇంకా దారుణం ఏమిటంటే ఆడబిడ్డను బరువుగా భావించి.. పురిటీలో ఉండగానే ఆడపిల్లను చంపేస్తున్నారు. మరికొందరు మగపిల్లాడి కోసం మూడు, నాలుగు కాన్పుల వరకు ఉంచుకుంటున్నారు. ఈక్రమంలో ఆడపిల్లలే పుట్టేసరికి..దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా శ్రీనివాసపురం తాలుకాలోని శెట్టి హళ్లి గ్రామానికి చెందిన లోకేష్ కు చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శిరీష అనే యువతితో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. లోకేష్ స్థానికంగా ఆటోడ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. మగ బిడ్డ కోసం లోకేష్ నాలుగో కాన్పు కోసమని శిరీష కు ఆపరేషన్ చేయించలేదు. మగబిడ్డ పుట్టలేదని లోకేష్ స్నేహితులతో చెప్పుకుని బాధ పడుతుండేవాడంట. ఈ క్రమంలోనే గర్భం దాల్చిన శిరీష నవంబర్ 4నతేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుడతాడని భావించిన లోకేష్ కి నిరాశే ఎదురైంది. దీంతో అతడు తీవ్ర వేదనకు గురయ్యాడు.
గత రెండు మూడు రోజుల నుంచి ఎవరితో మాట్లాడకుండా, ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం ఇంట్లో నుంచి తల్లిని, తమ్ముడిని వేరే ఇంటికి పంపించాడు. అర్ధరాత్రి సమయంలో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం విషయం తెలిసి లోకేష్ తల్లిదండ్రులు,భార్య శిరీష కన్నీరుమున్నీరు విలపించారు. తనకు తన పిల్లలకు ఇక దిక్కేవరు అంటూ లోకేష్ భార్య కన్నీటిపర్యతం అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలంకి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ద్వారా ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు.