ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోయాయి. వీటి కారణంగా దంపతుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కామారెడ్డి లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
పెళ్లి అనే కార్యంతో రెండు మనస్సులు ఒకటిగా మారి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాయి. ఒకరికొకరు తోడునీడగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ కలిసినడుద్దామంటూ ముందుకు సాగుతారు. ఇలా సాగే దాంపత్య జీవితంలో గొడవలు అనేవి సర్వసాధారణం. గొడవలు పడని భార్యాభర్తలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అయితే ఎలాంటి గొడవలైన నాలుగు గోడల మధ్య ఉంచుకోవాలని పెద్దలు చెప్తుంటారు. అయితే కొందరు భార్యలు మాత్రం సంసారంలో జరిగే ప్రతి విషయాన్ని బయటకు తీసుకొచ్చి రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు భర్తలు విచక్షణ కోల్పోయి భార్యపై దాడి చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. తన వ్యక్తిగత విషయాలను పంచాయితీ పెట్టి అందరిలో పరువు తీస్తుందని భార్యను గొడ్డలితో నరికి చంపాడు ఓ భర్త. ఈ దారుణమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన గంగామణి(38), గంగారాం భార్యాభర్తలు. గంగామణి స్థానికంగా ధోబీ పని చేస్తూ కుటుంబానికి ఆర్ధికంగా తోడు ఉండేది. ఆమె భర్త కూడా స్థానికంగా పని చేసుకుంటూ డబ్బులు సంపాదించేవాడు. చాలాకాలం పాటు వీరి సంసారం హాయిగా సాగింది. అయితే గంగారం బుద్ది పెడదారి పట్టి..పక్కచూపులు చూసింది. ఈ క్రమంలోనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలోనే గంగామణి.. భర్తతో తరచూ గొడవ పడేది. అంతేకాక కుటుంబ సభ్యుల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టించేది. అయిన అతడి తీరు మారదలేదు. ఆ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
భర్త చెడ్డు బుద్ధిని మార్చేందుకు తన సమస్యను అప్పుడప్పుడు పెద్దల వద్దకు తీసుకెళ్లేది. ఈ క్రమంలో ప్రతిసారీ పంచాయితీలు పెట్టి తన పరువు తీస్తుందని గంగామణిపై గంగారాం కోపం పెంచుకున్నాడు. ఇలా జరుగుతున్న క్రమంలో సోమవారం మరోసారి కుల పంచాయితీ ఏర్పాటు చేయించి అందరి ముందు మందలించింది. అందరిలో తన పరువుపోయిందని భావించిన గంగారాం ఆమె మరింత కోపం పెంచుకున్నాడు. ఈ విషయంలో మంగళవారం మధ్యాహ్నం భార్యతో ఘర్షణ పడ్డాడు. వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా.. కోపోద్రికుడైన గంగారం.. అక్కడే ఉన్న గొడ్డలిని తీసుకుని ఆమె మెడపై నాలుగైదు సార్లు వేటు వేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయింది.
అనంతరం నేరుగా బీర్కూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. లొంగిపోయాడు.. బాన్సువాడ రూరల్ సీఐ మురళి, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి పెద్ద కుమారుడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంగారాం చేసే తప్పుడు పనిని ప్రశ్నించినందుకే గంగామణి బలైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.