ఈ భూ ప్రపంచంలో వెల కట్టలేనిది అంటు ఉన్నది అంటే అది తల్లి ప్రేమ మాత్రమే. ఎందుకంటే ఏమి ఆశించకుండా మనకు ప్రేమను పంచేవారు ఎవరైన ఉన్నారంటే ఆమె అమ్మ మాత్రమే. తమకు ప్రాణం పోసిన తల్లి ప్రాణాలే తీస్తున్నారు కొందరు కసాయి కొడుకులు.
ఈ భూ ప్రపంచంలో వెల కట్టలేనిది అంటు ఉన్నది అంటే అది తల్లి ప్రేమ మాత్రమే. ఎందుకంటే ఏమి ఆశించకుండా మనకు ప్రేమను పంచేవారు ఎవరైన ఉన్నారంటే ఆమె అమ్మ మాత్రమే. నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డ ఏ చిన్న కష్టం కలిగిన తల్లి తల్లడిల్లిపోతుంది. ఏ చిన్న కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తన సంతోషాలను వదులుకుని బిడ్డల కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తుంది. అలాంటి తల్లికి వృద్ధాప్యంలో సపర్యలు చేయాల్సింది పోయి.. నరకం చూపిస్తున్నారు కొందరు పుత్రులు. మరికొందరు ఏకంగా తమకు ప్రాణం పోసిన తల్లి ప్రాణాలే తీస్తున్నారు. తాజాగా ఓ కసాయి కొడుకు గొంతు నులిమి తల్లిని హత్య చేశాడు. ఈ ఘోరమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కామారెడ్డి జిల్లా సదా శివనగర్ మండలం కేంద్రంలో ఇట్టబోయిన బాలవ్వ(80) అనే వృద్ధురాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉండి కుమారుడు చిన్న బాలయ్య వద్దే ఉంటుంది. అయితే ఆమెకు రోజు సపర్యలు చేయడం బాలయ్య భారంగా భావిస్తూ వస్తున్నాడు. తరచూ ఆమెపై కోప పడే వాడని సమాచారం. అయినా ఆమె నిస్సహాయ స్థితిలో జీవితాన్ని వెల్లదీస్తుంది. అయితే తల్లిని భారంగా భావిస్తూ వస్తున్న బాలయ్య.. ఆమెను వదిలించుకోవాలని భావించినట్లు సమాచారం. అందుకే ఈ నెల 13న రాత్రి చీరకొంగుతో తల్లి గొంతు నులిమి చంపాడు. అక్కడే ఉన్న ఓ రైస్ మిల్ వెనుక భాగంలో గొయ్యి తీసి బాలవ్వను పాతి పెట్టాడు.
ఆ తరువాత ఏమి తెలియనట్లు చుట్టు పక్కల వారికి అమ్మ కనిపించడం లేదని చెప్పుకొచ్చాడు. స్థానికులకు చిన్నబాలయ్య ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. దీంతో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు బీరయ్య ఠాణాలో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. కన్న కొడుకే హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. తల్లులపై దారుణాలకు తెగపడుతున్న ఇలాంటి కసాయి కుమారులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.