హిందూ వివాహాం బంధంలో మంగళ సూత్రానికి ఎంతో ప్రాధాన్యత చోటు చేసుకుంది. పురుషుడు తన జీవన ప్రయాణంలో తోడు, కుటుంబ అభివృద్ధి కొరకు స్త్రీ తన అర్ధ భాగస్వామిగా నిర్ణయించుకున్న స్త్రీని తాళికట్టి తన అర్ధాంగిగా స్వీకరిస్తాడు. అందుకే మంగళసూత్రాన్ని మహిళ ఎంతో పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకుంటారు. అంతేకాక వారు ఎలాంటి విపత్కర పరిస్థితిలో ఉన్న కూడా తాళిని కాపాడుకుంటారు. కొందరు మహిళలు అయితే ప్రాణాలైన పోయినా సరే తాళిబొట్టును అశ్రద్ధ చేయారు. దొంగలు మంగళ సూత్రాన్ని దొంగిలించే ప్రయత్నం చేసిన వారితో పోరాడేందుకు కూడా మహిళలు వెనకాడరు. అందుకు ఉదాహరణే హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటన. ఓ మహిళ మెడలో నుంచి మంగళ సూత్రాన్ని కొట్టేసే దొంగ ప్రయత్నిచాడు. ఆమె ఎదురు తిరగడంతో కత్తితో గాయపరిచాడు. కత్తిపోట్లను భరించి మరీ.. ఆ దొంగతో పోరాడింది ఆ వీర మహిళ. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నిజామాబాద్ కు చెందిన అశోక్ , కనక మహాలక్ష్మి దంపతులు. హైదరాబాద్ లోని బోరబండలో అనారోగ్యంతో బాధపడుతున్న బంధువును పరామర్శించేందకు వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో రోటేగావ్-కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలులో హైదరాబాద్ వరకు వచ్చారు. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ పడటంతో రైలు ఆగింది. దీంతో అప్పటికి ఆ దంపతులను గమనిస్తున్న ఓ దొంగ అదే అదనుగా భావించాడు. కనక మహాలక్ష్మి మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. అయితే వెంటనే తేరుకున్న ఆ దంపతులు దొంగను పట్టుకుని కేకలు వేశారు. అయితే కొద్ది సమయం పాటు ఎవరు ముందుకు రాలేదు. అతడి చేతిలోని బంగారు మంగళసూత్రం తీసుకునేందుకు దంపతులు పోరాడారు. దొంగ… తన వద్ద ఉన్న కత్తితో అశోక్ ను గాయపరిచాడు.
అంతేకాక లక్ష్మిని కూడా కత్తితో గాయపరిచాడు. ఈ క్రమంలోనే ఆమెను గట్టిగా నెట్టడంతో కిందపడి గాయాలయ్యాయి. అయినా రక్తం కారుతున్న ఆ మహిళ దొంగను వదిలిపెట్టలేదు. అతడితో చాలా సేపు పోరాడింది. అయితే కొద్ది సేపటితరువాత తోటి ప్రయాణికులు ధైర్యం చేసి ముందుకు రావడంతో దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. సీతాఫల్ మండి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళసూత్రాన్ని కాపాడుకునేందుకు ఆ మహిళ చూపిన తెగువను స్థానికులు ప్రశంసించారు. మరి.. మహిళ చూపిన తెగువపై మీ ప్రశంసలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.