నేటికాలంలో మనషుల్లో మానవత్వం కనుమరుగైపోతుంది. తనకు సంబంధించిన వారు తప్ప ఇతరులు ఎవరు తనకు అక్కర్లేదు అన్నట్లు కొందరు ప్రవర్తిస్తున్నారు. ఇక సవతి తల్లులు కొందరు అయితే పిల్లల పట్ల క్రూరత్వం ప్రదర్శిస్తున్నారు. తన బిడ్డలను ఒకలా, సవతి పిల్లలను మరొకలా చూస్తున్నారు. భర్త లేని సమయంలో ఆ పిల్లలను దారుణంగా హింసిస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే సవతి పిల్లలను దారుణంగా హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఝార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తన భర్త మొదటి భార్య పిల్లలకు విషమిచ్చింది. ఒకరు మరణించగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఝార్ఖాండ్ రాష్ట్రం గిరిదిహ్ జిల్లా రోహంతాండ కు చెందిన సునీల్ సోరైన్ అనే వ్యక్తికి సునీత హన్డ్సా అనే మహిళతో రెండో విహహం జరిగింది. రెండేళ్ల క్రితం మొదటి భార్య పాము కాటుకు గురై చనిపోయింది. సునీల్ కి, తన మొదటి భార్యకు నలుగురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. మొదటి భార్య మరణంతో పిల్లలను చూసుకునేందుకు గోరియాచు గ్రామానికి చెందిన సునీతను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమెకు పిల్లలు లేరు. అయితే ఆమెకు పిల్లలు లేకపోవడంతో సవతి పిల్లలపై అసూయ పెంచుకుంది. వారిని భర్తకు తెలియకుండా హింసిస్తుండేది. సవతి పిల్లలను అడ్డుతొలగించుకుంటే తన భర్తతో ప్రశాంతగా ఉండొచ్చని భావించింది. ఈ క్రమంలో సునీల్ మొదటి భార్య పిల్లలు..వారి తాతయ్య, అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లారు.
సునీత..తన భర్తతో కలిసి దుర్గం పూజల కోసం ఆమె సొంతూరికి వెళ్లింది. పూజ అనంతరం ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. సునీల్ ఉపాధి నిమిత్తం బెంగళూరుకు వెళ్లాడు. తాతయ్య వద్ద ఉన్న పిల్లలను సునీత రోహంతాండ్ కు తీసుకొచ్చింది. భర్త లేకపోవడం సరైన సమయంగా భావించిన సునీత.. గురువారం ఉదయం అనిల్ సోరైన్(3), శంకర్ సోరైన్(8), విజయ్ సోరైన్(12)కు చికెన్ లో విషం కలిపి తినిపించింది. వారికి ఆ విష ప్రభావం ఎక్కేవరకు అక్కడే ఉంది. వారి ఆరోగ్యం క్షీణించిన అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనలో అనిల్ సోరైన్ మృతిచెందగా, శంకర్ పరిస్థితి విషమంగా ఉంది. చికెన్ ను తక్కువగా తినడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితురాలి అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వారు పేర్కొన్నారు.