మానవ జీవితం అనేది నీటి బుడగలాంటి. ఎంతో అందగా కనిపించే నీటి బుడగ ఎప్పుడు ఠప్ అంటుందో చెప్పలేము. అలానే మనిషి జీవితం కూడా ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. ఎందుకంటే హాయిగా సాగిపోతున్న సంసారాల్లో అనుకోని ఘటనతో చీకటి కమ్ముకుంటుంది. అప్పటి వరకు అమ్మచాటున ఏ కష్టం తెలియకుండా బతికిన పిల్లలు అనాథలుగా మారిపోతారు. ఇలాగే జరిగిన అనేక మంది జీవితాలను మనం చూశాం. అచ్చం అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. పిల్లలతో ఆనందగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతుల కుటుంబంలో ఓ చిన్న ఘటనతో చీకటి కమ్ముకుంది. హాస్టల్ లో చదువుతున్న తమ కుమార్తెను చూడాలని అనుకున్న వారి కోరికే.. జీవితాలను కోల్పోయేలా చేసింది. నగరంలో చదువుకుంటున్న కూతుర్ను చూసేందుకు వెళ్తున్న తల్లిదండ్రులతో పాటు మరొక పాప రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘోరమైన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కడియాలకుంట తండాలో గోపాల్(47), అంజలి(42) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు , ఓ అబ్బాయి ఉన్నారు. గోపాల్ స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నలుగురు పిల్లలతో వారు ఎంతో హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. మూడో కుమార్తె మధులత నగరంలోని చంపాపేట్ సంక్షేమ హాస్టల్ లో చదువుతోంది. అప్పుడప్పుడు పాపతో ఫోన్లో మాట్లాడేవారు. అయితే ఆ దంపతులకు హస్టల్ లో ఉన్న కుమార్తెను చూడాలని కోరిక కలిగింది. దీంతో హస్టల్ ఉంటున్న కూతుర్ని చూసేందుకు ఆ దంపతులు చిన్న కుమార్తె స్వాతి(9)తో కలసి బైక్ పై బయలు దేరారు. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ సమీపంలోకి రాగానే డీసీఎం వ్యాన్ ను కారును ఢీకొట్టింది. అది వెళ్లి..గోపాల్ వాళ్లు ప్రయాణిస్తున్న బైక్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు.
డీసీఎం వాహనం అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గోపాల్, అంజలి మృతితో వారి పిల్లలు అనాథలుగా మారారు. చెల్లిని చూసి సాయంత్రం అమ్మనాన్నలు ఇంటికి వస్తారులే.. అని ఎదురుచూస్తున్న పిల్లలకు వారి మరణవార్త తెలిసింది. దీంతో గోపాల్ కుటుంబం తీవ్ర విషాదం అలుముకుంది. కొందరి నిర్లక్ష్యం కారణంగా ఇలా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు, పోలీసులు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.