దేశంలో మహిళలపై వేధింపులు, దాడులు, అత్యాచారాలు ఏ మాత్రం ఆగడం లేదు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక చోట ఆడవాళ్లపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మరో విషయం ఏటంటే.. ఈ దాడులను ఎదుర్కోవాల్సిన అధికారులు సైతం ఇలాంటి వేధింపులకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలకు సేవ చేసే హోదాలో ఉన్నవారిని సార్థం నీచులు వదలడం లేదు. తాజాగా.. ఓ సర్పంచ్ భర్త మహిళా వాలంటీర్ ను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా ముసునూరు మండలంలోని రమణక్కపేటలో ఓ మహిళ మూడేళ్ల నుంచి స్థానిక వాలంటీర్ గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ భర్త రంగు గాంధీ తనను మానసికంగా వేధిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విధులు నిర్వహించే సమయంలో మానసికంగా వేధిస్తున్నట్లు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని తెలిపింది. ‘నువ్వంటే నాకిష్టం.. నీతో ఉండాలనిపిస్తుంది’ అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్న ఆమె.. వేధింపులు శృతిమించడంతో.. ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ లకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి: కానిస్టేబుల్ వేధింపులకు యువతి ఆత్మహత్య!