బహుళ అంతస్తులు ఉండే అపార్ట్‌మెంట్స్, షాపింగ్ మాల్స్ లో సౌకర్యవంతం కోసం లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వాటి వినియోగంలో సరైన జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలామంది గాయపడుతుండగా, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఓ మహిళ లిఫ్ట్ లో ఇరుక్కొని మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం
హైదరాబాద్ లో బంజారాహిల్స్ సర్కిల్ లోని ఎల్ నగర్ లో వీణ(38) అనే మహిళ ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తుంది. ఎప్పటిలాగానే అపార్ట్ మెంట్ లోని ఆ ఇంట్లో పనిచేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ లో ఇరుక్కుని సదరు మహిళ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇది చదవండి : అన్నా అని పిలిచినా కనికరించలేదు.. మావయ్యను అవుతానని
గతేడాది డిసెంబర్ లో ఇదే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ హోటల్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తోన్న వ్యక్తి లిఫ్ట్ లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు ఓ చిన్నారి కూడా ఇదే విధంగా లిఫ్ట్ లో ఇరుక్కుపోయి మృతి చెందింది. కారణంగా ఏదైనా, దీనికి బాధ్యులు ఎవరైనా, తరచూ ఇలాంటి లిఫ్ట్ ప్రమాదాలతో చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.