ఆమె పేరు తులసి. ఆమెకు మేన బావంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడే అతడికి తన మనసులో గుడి కట్టుకుంది. అతడు కూడా ఆమె మనసు తెలిసినట్లు ప్రవర్తించేవాడు. తులసితో చనువుగా ఉండేవాడు. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. బావే కదా అనుకుంది.. అతడితో శారీరకంగా కలిసింది. ఏళ్లు గడిచాయి. అతడిలో మార్పొచ్చింది. ఆ మార్పు తులసి వార్తల్లో కెక్కేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, కొట్టయూర్ గ్రామానికి చెందిన తులసి.. ఆమె మేనబావ అయిన సతీష్ కుమార్ ప్రేమించుకున్నారు. దాదాపు ఏడేళ్లుగా వీరి ప్రేమాయణం నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే సతీష్ కుమార్ తులసిని శారీరకంగా లొంగ తీసుకున్నాడు. బావే కదా.. ఏలాగూ పెళ్లి కూడా అవుతుంది కదా అని ఆమె అనుకుంది. బావకు తన దేహాన్ని అర్పించింది. తరచుగా ఇద్దరూ కలిసేవారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా అతడు పెళ్లి మాట ఎత్తకపోవటంతో రెండు నెలల క్రితం తులసి అతడి దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చింది. ఇక అప్పటినుంచి తనను పెళ్లి చేసుకోమని తరచూ కోరుతోంది. అతడు ఆమె మాటను దాటవేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సతీష్‌కు తులసి ప్రవర్తన కోపం తెప్పించింది. ‘‘ఇకపై పెళ్లి ప్రస్తావన తెస్తే..
సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తా!’’ అని బెదిరించాడు. ఈ నేపథ్యంలోనే యువతి తల్లిదండ్రులు సతీష్ ఇంటికి వెళ్లారు. తులసిని పెళ్లి చేసుకోమని కోరారు. ఇందుకు సతీష్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పెళ్లి జరగాలంటే.. 50 సవర్ల బంగారం, కారు కట్నంగా కావాలన్నారు. దీంతో యువతి జిల్లా కలెక్టర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోసం చేసిన బావ ఇంటి ముందు నిరసనకు దిగింది. పోలీసులు ఆమెను ఒప్పించి ఇంటికి పంపారు. పరారీలో ఉన్న సతీష్ కుటుంబసభ్యుల కోసం గాలిస్తున్నారు.