తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన చంద్రిత తరచుగా అమ్మమ్మ గారి ఊరైన రామాపురానికి వెళ్లేది. రామాపురంలోని అరుంథతి వాడకు చెందిన వాలంటీర్ చంద్రశేఖర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చంద్రశేఖర్‌కు ఇది వరకే పెళ్లయింది. ఓ బాబు కూడా ఉన్నాడు. ఆ విషయం తెలిసి కూడా చంద్రిత అతడితో ప్రేమలో పడింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. అయితే, వీరి ప్రేమ విషయం తెలిసి పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రిత తల్లిదండ్రులు ఆమెకు చివాట్లు పెట్టి, అతడికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. దీంతో ఇద్దరిలో కలవరం మొదలైంది. అక్కడే ఉంటే తల్లిదండ్రుల కారణంగా విడిపోవాల్సి వస్తుందని భావించారు.
ఈ నేపథ్యంలోనే 2021లో ఇద్దరూ ఇళ్లనుంచి పారిపోయారు. విషయం గుర్తించిన చంద్రిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 5 రోజుల్లోనే పోలీసులు వారిని వెతికి పట్టుకున్నారు. ఎవరి ఇళ్లకు వాళ్లను పంపేశారు. దీంతో చంద్రితను ఆమె తల్లిదండ్రులు బంధువుల ఊరైన దొరవారి సత్రానికి పంపారు. ప్రియుడు చంద్రశేఖర్‌తో కలుసుకోకుండా కట్టుదిట్టం చేశారు. ఆమె దగ్గర సెల్‌ఫోన్ కూడా లేకుండా చేశారు. మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. కొన్నిరోజుల తర్వాత సదరు యువకుడు ఓ సెల్‌ఫోన్ ఆమెకు కొనిచ్చాడు. దీంతో చంద్రిత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాబోయే భర్త కొనిచ్చిన ఫోన్ ద్వారా తన ప్రియుడిని సంప్రదించింది. మళ్లీ చంద్రశేఖర్‌తో మాట్లాడటం మొదలుపెట్టింది.
జనవరి 10, 2022
చంద్రశేఖర్, చంద్రిత దొరవారి సత్రంనుంచి పారిపోయారు. దీంతో ఇరుకుటుంబాల వారు పోలీసులను సంప్రదించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, వారి ఆచూకీ లభ్యం కాలేదు. నెలలు గడిచినా వారు ఎక్కడ ఉన్నారో పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 20న తెలుగు గంగ కాలువలో ఉబ్బిన స్థితిలో గుర్తు తెలియని యువతి శవం లభించింది. పోలీసులు చంద్రిత తల్లిదండ్రులను సంప్రదించగా.. ఆ శవం తమ కూతురిదేనని పుట్టుమచ్చల ఆధారంగా గుర్తించారు. తమ బిడ్డ చావుకు చంద్రశేఖరే కారణమంటూ, అతడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. వారికి టీడీపీ, జనసేనలు అండగా నిలిచాయి. న్యాయం జరగాలంటూ ధర్నాలు నిర్వహించారు.
అక్టోబర్ 22, 2022
ఏర్పేడు మండలం, అంజిమేడు సమీపంలోని బండమానుకాల్వలో ఓ యువకుడి శవం బయటపడింది. పోలీసులు చంద్రశేఖర్‌దిగా భావించి, అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే, వారు శవాన్ని చూడటానికి రాలేదు. ఆ శవాన్ని చంద్రిత తల్లిదండ్రులకు చూపించగా అది చంద్రశేఖర్‌దేనని అన్నారు. కానీ, పోలీసులు అనుమానంతో ఆ రెండు శవాలను డీఎన్‌ఏ పరీక్షల కోసం పంపారు. ఇక, అప్పటినుంచి శవాలను ఆసుపత్రిలోనే ఉంచారు. తమ కూతురి న్యాయం జరిగే వరకు శవాన్ని తీసుకెళ్లమని చంద్రిత తల్లిదండ్రులు స్పష్టం చేశారు.
అక్టోబర్ 30, 2022
చంద్రిత, చంద్రశేఖర్‌లు చనిపోయారనుకుంటున్న కుటుంబసభ్యులు, జనాలకు ఊహించని ఓ ట్విస్ట్ ఎదురైంది. తాము చనిపోలేదని, బతికే ఉన్నామని ఇద్దరూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సామాన్య జనాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వీడియోలో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘‘ అక్కడి పోలీసు మాతో తప్పుగా మాట్లాడాడు. మా అమ్మతో కూడా దురుసుగా ప్రవర్తించాడు. అందుకే మేము స్టేషన్‌కు రాలేకుండా ఉన్నాము. వచ్చేదానికి సమస్య కాదు. వచ్చి మా ఊరిలో ఉన్నా కూడా మీ పరువే పోతుంది. మేము హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడిప్పుడే సర్ధుకుంటూ ఉన్నాయి. ఇలాంటి టైంలో తప్పుడు ప్రచారాలు చేయకండి’’ అని కోరాడు.