ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా కొంతమంది దుండగులు మాటు వేసి కిడ్నాప్ చేశారు. అనంతరం అతన్ని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి చచ్చేలా కొట్టారు. ఏమీ ఎరగనట్టు యాక్సిడెంట్ అని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చివరికి?
రంగారెడ్డి జిల్లా కొత్తూరులో కొంతమంది దుండగులు కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. కారులో వెళ్తుండగా చేగూర్ వద్ద కారును అడ్డగించిన దుండగులు కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేశారు. అనంతరం అతని కాళ్ళు, చేతులు విరగ్గొట్టి గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. ఏం జరిగిందని వైద్యులు అడిగితే యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పారు. అయితే కరుణాకర్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో నిందితులు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. చేగూర్ సమీపంలో మాటు వేసిన ఐదుగురు దుండగులు కారును అడ్డగించారు. ఆపై కారు అద్దాలు ధ్వంసం చేసి కారు యజమాని శ్రీధర్ రెడ్డిపై దాడి చేశారు.
అనంతరం అదే కారులో ప్రయాణిస్తున్న కరుణాకర్ రెడ్డిని బలవంతంగా వేరే కారులో ఎక్కించి కిడ్నాప్ చేశారు. రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి కాళ్ళూ, చేతులూ కట్టేసి చితకబాదారు. ఈ దాడిలో కరుణాకర్ రెడ్డి కాళ్ళూ, చేతులు విరిగిపోయాయి. అపస్మారక స్థితిలో ఉన్న కరుణాకర్ రెడ్డిని నిన్న రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు కరుణాకర్ రెడ్డి అప్పటికే చనిపోయాడని చెప్పడంతో అక్కడ నుంచి పరారయ్యారు. పాత కక్షల కారణంగానే ఎంపీపీ మధుసూదన్ తన కొడుకును కిడ్నాప్ చేసి చేశాడని కరుణాకరెడ్డి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరుణాకర్ రెడ్డి స్వస్థలం మల్లాపూర్ లో ఓ భూ వివాదంలో ఎంపీపీతో కరుణాకర్ రెడ్డికి వైరం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆ వైరం కారణంగానే కిడ్నాప్ చేశాడని ఆమె ఆరోపించారు. భూ వివాదం కారణంగానే హత్య జరిగినట్లు తెలుస్తోంది. కొంతకాలం క్రితం జరిగిన పంచాయతీలో పంచాయితీ పెద్దలు కరుణాకర్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పగ పెంచుకుని తన కొడుకుని హత్య చేశారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. 15 మందితో కరుణాకర్ రెడ్డి హత్యకు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి, అరుణ్, ఆరిఫ్, విక్రమ్ రెడ్డి అనే నలుగురు వ్యక్తులు కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు భావించిన పోలీసులు వారిని విచారిస్తున్నారు.