వరంగల్ ఎల్బీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణంగా హత్యకు గురయ్యారు. ఇంట్లో ఎటుచూసినా రక్తం. తెల్లవారుజామున నిద్రపోతున్న వారిపై కత్తులతో దాడి చేశారు. అతి కిరాతకంగా నరికి చంపారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై విచక్షణారహితంగా దాడి చేయగా వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల ఫిర్యాదు ప్రకారం దాడి చేసింది ఎవరో కాదు మరణించిన వ్యక్తికి సొంత తమ్ముడే. ఈ వార్త విని స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఆస్తి గొడవలే ఈ దారుణ హత్యలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎల్బీనగర్‌లో నివాసముండే మహమ్మద్ చాంద్‌పాషాకు ఆయన సోదరుడు షఫీతో పశువుల వ్యాపారం లావాదేవీల్లో గతేడాదిగా గొడవలు జరుగుతున్నాయి. అన్నపై కక్ష పెంచుకున్న షఫీ మరో కొందరితో కలిసి బుధవారం తెల్లవారుజామున వారి ఇంట్లోకి చొరబడి నిద్రపోతున్న మహమ్మద్ చాంద్‌పాషా, ఆయన భార్య సబీరా బేగం, కుమారులు సహేద్, సమీర్, బావ మరిది ఖలీల్‌లపై దాడి చేశారు. ఈ మొత్తం ఘాతుకానికి షఫీనే కారణమని చాంద్‌పాషా కుమార్తె పోలీసులకు తెలిపింది. దాడిలో చాంద్‌పాషా, ఆయన భార్య, బావమరిది అక్కడికక్కడే మరణించగా.. కుమారులు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.