పైన ఫొటోలో కనిపిస్తున్న బాలికల పేర్లు పరిమళ, స్వప్న, హసీనా. ఇటీవల వీళ్లు ముగ్గురు ఫ్రెండ్ బర్త్ పార్టీ ఉందంటూ బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో వరుసగా బాలికల మిస్సింగ్ ఘటనలు తీవ్ర కలకలంగా మారుతున్నాయి. గతంలో మేడ్చల్ జిల్లాలోని ఓ బాలిక అదృశ్యం అయి.. చివరికి చెరువులో శవమై తేలిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనే కాకుండా చాలా మంది బాలికలు అదృశ్యమయ్యారు. అయితే ఇవి మరువకముందే.. తాజాగా సికింద్రాబాద్ పరిధిలో ఏకంగా ఒకేసారి ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో నివాసం ఉంటున్న పరిమళ, స్వప్న, హసీనా అనే ముగ్గురు బాలికలు ఇటీవల తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉందని ఇంట్లో చెప్పి వెళ్లారు. కానీ, రాత్రైన వారు ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఖంగారుపడి స్థానిక ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆ ముగ్గురి బాలికల ఆచూకి మాత్రం లభించలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ బాలికల తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే పోలీసులు అనుమానం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇకపోతే ఉన్నట్టుండి కూతుళ్లు కనిపించకపోవడంతో ఆ బాలికల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ మిస్సింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.