శ్రీకాకుళం జిల్లా జంట హత్యల ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివాహేతర సంబంధాల కారణంగానే మూడు ప్రాణాలు గాలిలో కలిసి పోయాని కొందరు వాపోతున్నారు. అయితే మృతుడు సంతోష్ కుమార్ మరణంపై తల్లి స్పందించి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆమె ఏం చెప్పిందంటే?
శ్రీకాకుళం జిల్లాలోని జంట హత్యల ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారిన విషయం తెలిసిందే. జిల్లాలోని సారవకోట మండలం కోదడ్డపనస గ్రామంలో ఎర్రమ్మ అనే మహిళ నివాసం ఉండేది. ఆమె వరుసకు మరిది అయ్యే రామారావు, ఎర్రమ్మ మధ్య వివాహేతర సంబంధం నడిచినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ అనే మరో యువకుడు ఎర్రమ్మతో అక్రమ సంబంధం నడిపించాడని రామారావు అనుమానపడ్డాడు. పైగా రామారావుకు గతంలో కొన్ని గొడవలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రామారావు దారుణానికి పాల్పడ్డాడు.
మంగళవారం సాయంత్రం రామారావు ఇటు సంతోష్ కుమార్ ను, అటు తన ప్రియురాలైన ఎర్రమ్మను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం రామారావు అదే కత్తితో గొంతు కోసుకుని తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక సంతోష్ కుమార్ మరణించడంతో అతని తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. కుమారుడి మరణంపై స్పందించి మీడియాతో మాట్లాడింది. నా కొడుకు ఎవరితో గొడవలు పెట్టుకోలేదు. అసలు వీధిలోకి కూడా వెళ్లేవాడు కాదని వాపోయింది. పేగు తెంచుకుని కన్నానని, నా కుమారుడు చాలా మంచోడని, అన్యాయంగా నా కొడుకుని హత్య చేశాడని కన్నీరు మున్నీరుగా విలపించింది. అనంతరం సంతోష్ కుమార్ పిన్నీ మాట్లాడుతూ.. సంతోష్ కుమార్ కు ఎర్రమ్మ వరుసకు పిన్ని అవుతుందని, అతడు ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోలేదని తెలిపింది. గతంలో రామారావు, సంతోష్ కుమార్ మధ్య చిన్న గొడవలు జరిగాయని, ఈ మధ్య ఎలాంటి గొడవలు లేవని వివరించింది. సంతోష్ కుమార్ మరణంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు.