బెంగుళూరులో ఘోరం జరిగింది. అనుకోని ప్రమాదంలో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో కండక్టర్ బస్సులోనే సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు..!
కర్ణాటకలో ఘోరం జరిగింది. కండక్టర్ నిద్రించిన బస్సుకు మంటలు అంటుకోవడంతో అతడు అదే మంటల్లో సజీవ దహనమయ్యాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ముత్తయ్య స్వామి (45) అనే వ్యక్తి బెంగుళూరులో బస్సు కండక్టర్ గా పని చేస్తున్నాడు. అయితే గురువారం రాత్రి వీరి బస్సు కాస్త ఆలస్యంగా లింగధీరనహళ్లిలో ఉన్న బస్టాండుకు వచ్చింది. బస్సును పార్క్ చేసి డ్రైవర్ ప్రకాశ్ బస్టాండ్ లో పడుకోవడానికి వెళ్లాడు. కానీ, బాగా నిద్రలో ఉన్న కండక్టర్ ముత్తయ్య స్వామి మాత్రం అదే బస్సులో నిద్రపోయాడు.
ఇక మధ్యరాత్రి అనుకోని ప్రమాదంలో ముత్తయ్య నిద్రిస్తున్న బస్సుకు మంటలు అంటుకున్నాయి. శుక్రవారం తెల్లవారు జామున 4:45 నిమిషాలకు డ్రైవర్ ప్రకాశ్ ఈ ప్రమాద ఘటనను గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అనంతరం బస్సులోకి వెళ్లి చూడగా.. కండక్టర్ ముత్తయ్య స్వామి బస్సులోనే సజీవదహనమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మన్నీరుగా విలపించారు.
అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. పోలీసుల ఉన్నతాధికారులు
సైతం ఘటనా స్థలానికి చేరుకుని ఈ ప్రమాదానికి కారణాలను వెతికే పనిలో పడ్డారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా చేశారా అనే దానిపై కాస్త లోతుగా విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. బస్సులో సజీవ దహనమైన కండక్టర్ ఘటనపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.